Etela Rajender: ఉద్యమ సంఘాలన్నీ ఈరోజు కల్వకుంట్ల కవిత చేతిలో ఉన్నాయి: ఈటల

  • సమ్మెలు చేసినా సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి ఉంది
  • ఆర్టీసీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని కేసీఆర్ అన్నారు
  • నీచపు వార్తలతో ప్రజలకు నన్ను దూరం చేసే యత్నం చేశారు
All unions are in hands of Kavitha says Etela Rajender

టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సంఘాలు, యూనియన్లే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సమ్మెలు చేసినా సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితులు లేవని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ఉద్యమ సంఘాలన్నీ ప్రస్తుతం కల్వకుంట్ల కవిత చేతిలో ఉన్నాయని ఆరోపించారు. మంత్రులు డమ్మీలుగా మారారని... ఆర్థికశాఖ సమీక్షల్లో ఆర్థిక మంత్రి కూడా ఉండని పరిస్థితి ఉందని అన్నారు.

ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని... బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేడని గతంలో కేసీఆర్ చెప్పారని ఈటల చెప్పారు. ఆర్థిక మంత్రిగా తాను ఉన్నప్పుడు తాను చేసిన సూచనలను కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. ట్యాక్స్ పే చేసే వారికి రైతుబంధు ఇవ్వొద్దని తాను చెప్పానని, అలాంటి వారికి ఇచ్చినా ఉపయోగం ఉండదని తెలిపానని చెప్పారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పడం తన తప్పా? అని ప్రశ్నించారు.

కుక్కిన పేనులా ఉండకపోవడం వల్లే తనపై టీఆర్ఎస్ హైకమాండ్ కు కోపం వచ్చిందని ఈటల అన్నారు. నీచపు వార్తలతో ప్రజలకు తనను దూరం చేసేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రజలు అహింసాయుతంగా నిరసన తెలిపే ధర్నాచౌక్ ను కూడా ఎత్తేసిన ఘనత కేసీఆర్ దని మండిపడ్డారు.

More Telugu News