Andhra Pradesh: యాస్ తుపాను ఎఫెక్ట్: ఏపీలో పెరిగిన ఎండలు.. 18 మండలాల్లో వడగాల్పులు

  • తుపాను ప్రభావంతో గాలిలో తగ్గిన తేమ
  • రాజమహేంద్రవరంలో అత్యధికంగా 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు
  • కళింగ పట్నంలో సాధారణం కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత అధికం
  • ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందన్న అధికారులు
Yaas cyclone Effect temperatures raised in Andhrapradesh

యాస్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. నిన్న రాజమహేంద్రవరంలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అమరావతి, నందిగామ, బాపట్లలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, విశాఖపట్టణంలో 42.2 డిగ్రీలు నమోదైంది. జంగమహేశ్వరపురం, విజయవాడ, మచిలీపట్టణంలో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు కాగా, కాకినాడ, కావలిలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు, కళింగపట్నంలో సాధారణం కంటే 5.5 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా రికార్డయింది. యాస్ తుపాను ప్రభావంతో వాతావరణంలో తేమ తగ్గడం, దానికి తోడు ఉత్తరం వైపు నుంచి పొడిగాలులు వీస్తుండడమే ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

తుపాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా తేమ తగ్గడంతో విశాఖపట్టణం జిల్లాలో 15, తూర్పు గోదావరి జిల్లాలో మూడు మండలాల్లో వడగాల్పులు వీచాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోని పలు మండలాల్లో నేడు, రేపు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాగే, ఎండల ప్రభావం కూడా ఈ నెలాఖరు వరకు ఉంటుందని వివరించారు.

More Telugu News