Randeep Guleria: ఫంగస్ లకు రంగులు ఆపాదించి గందరగోళానికి గురిచేస్తున్నారు: ఎయిమ్స్ చీఫ్

  • దేశంలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వ్యాప్తి
  • పరిస్థితులను బట్టి రంగు మారుతుందన్న గులేరియా
  • ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగులో ఉంటుందని వివరణ
  • థర్డ్ వేవ్ లో చిన్నారులకు ముప్పులేదని స్పష్టీకరణ
AIIMS Chief Randeep Guleria comments on fungus colouring

దేశంలో కొన్నిరోజులుగా బ్లాక్ ఫంగస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, కరోనా రోగుల్లో ప్రాణాంతకంగా మారుతున్న ఫంగస్ లకు రంగులు ఆపాదించడంపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఫంగస్ లను రంగుల పేర్లతో పిలవడం ద్వారా గందరగోళం సృష్టిస్తున్నారని, ఒకరకంగా ఇది తప్పుదారి పట్టించడమేనని అభిప్రాయపడ్డారు.

ఫంగస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగులో కనిపిస్తుందని, అక్కడి పరిస్థితులు దాని రంగును ప్రభావితం చేస్తాయని స్పష్టం చేశారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ సాంక్రమిక వ్యాధి కాదని అన్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు మూడు రకాలు అని... అవి 1.మ్యూకోర్ మైకోసిస్ 2. కాండిడా 3. ఆస్పర్ జిల్లోసిస్ అని వివరించారు. వీటిలో మ్యూకోర్ మైకోసిస్ కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్టు చెబుతున్నారని, ఆస్పర్ జిల్లోసిస్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని తెలిపారు.

ఇక, కరోనా మూడో వేవ్ తథ్యమని, మూడో వేవ్ లో పిల్లల పాలిట కరోనా ప్రమాదకరంగా మారుతుందన్న ప్రచారంపైనా గులేరియా స్పందించారు. ఈ ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. పీడియాట్రిక్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం పిల్లలపై కరోనా థర్డ్ వేవ్ ఏమంత ప్రభావం చూపబోదని, దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

More Telugu News