Tamilnadu: తమిళనాడులో మరో వారం రోజులు సంపూర్ణ లాక్ డౌన్

  • తమిళనాడులో కరోనా కల్లోలం
  • గత నాలుగు రోజులుగా కేసుల్లో పెరుగుదల
  • సమీక్ష చేపట్టిన సీఎం స్టాలిన్
  • మే 24 నుంచి వారం పాటు కఠిన లాక్ డౌన్
  • అత్యవసర సర్వీసులకు మినహాయింపు
Tamilnadu govt extends complete lock down for a week

తమిళనాడులో ఇప్పటికీ కొవిడ్ వ్యాప్తి అదుపులోకి రాని నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. మే 24 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించడం తెలిసిందే.

మరో రెండ్రోజుల్లో ఆ లాక్ డౌన్ ముగియనుండడంతో సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై చర్చించారు. వైద్య, ఆరోగ్య నిపుణులు రెండు వారాలు కఠిన లాక్ డౌన్ విధించాలని సూచించారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా పకడ్బందీగా లాక్ డౌన్ విధించాలని, అప్పుడే కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

కాగా, తమిళనాడులో నిన్న వెలువడిన బులెటిన్ లో 36,184 కేసులు, 467 మరణాలు నమోదైనట్టు పేర్కొన్నారు. గత నాలుగు రోజుల నుంచి కేసులు పెరుగుతుండడంతో డీఎంకే సర్కారు అప్రమత్తమైంది. తాజా లాక్ డౌన్ లోనూ అత్యవసర సర్వీసులకు మినహాయింపునిచ్చారు.

More Telugu News