Ramlakshman: బాలీవుడ్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ కన్నుమూత

  • అనారోగ్యంతో నాగ్ పూర్ లో నేడు మృతి
  • బాలీవుడ్ ప్రముఖుల సంతాపం
  • పలు భాషల్లో 150కి పైగా చిత్రాలకు సంగీతం
  • 'మైనే ప్యార్ కియా', 'హమ్ ఆప్కే హై కౌన్' మ్యూజికల్ హిట్స్ 
  • రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్
Bollywood music director Ram Lakshman dies of longtime illness

బాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ కన్నుమూశారు. 78 ఏళ్ల రామ్ లక్ష్మణ్ నాగ్ పూర్ లోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్. 1975లో పండూ హవల్దార్ అనే మరాఠీ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు. ఆ సినిమాకు తన స్నేహితుడు సురేంద్రతో కలిసి రామ్ లక్ష్మణ్ పేరుతో సంగీతం అందించారు. ఆ తర్వాత ఏడాదే సురేంద్ర మరణించడంతో, విజయ్ పాటిల్ తన మిత్రుడి జ్ఞాపకార్థం రామ్ లక్ష్మణ్ పేరుతోనే కొనసాగారు. ఆయన హిందీ, మరాఠీ, భోజ్ పురి భాషల్లో 150కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు.

ఆయన బాణీలు సమకూర్చిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, 100 డేస్, పత్తర్ కే పూల్ వంటి చిత్రాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. రాజశ్రీ ప్రొడక్షన్స్ కు ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు అనడంలో అతిశయోక్తి లేదు. రాజశ్రీ బ్యానర్ లో ఆయన అత్యధిక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. కాగా, రామ్ లక్ష్మణ్ మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News