Barge P305: 'బార్జ్ పి305' నౌక మునిగిన ఘటనలో 49కి పెరిగిన మృతుల సంఖ్య

  • తౌతే తుపాను కారణంగా సముద్రంలో మునిగిన బార్జ్ పి305
  • ప్రమాద సమయంలో బార్జ్‌లో 261 మంది
  • 186 మందిని రక్షించిన నావికాదళం
  • టగ్ బోటు ప్రమాదంలో గల్లంతైన 11 మంది కోసం వెతుకులాట
Death toll in Barge P305 submerge raised to 49

తౌతే తుపాను కారణంగా ముంబై తీరంలో అరేబియా సముద్రంలో బార్జ్ పి305 మునిగిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 49కి పెరిగింది. బుధవారం 26 మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది నిన్న మరో 23 మంది మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన మరో 26 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు దాటడంతో వారు బతికి ఉండే అవకాశాలు తక్కువేనని నేవీ అధికారులు చెబుతున్నారు.

ప్రమాద సమయంలో బార్జ్‌లో 261 మంది ఉన్నారు. వారిలో 186 మందిని రక్షించారు. మరోవైపు టగ్‌బోటు వరప్రద మునిగిన ఘటనలో గల్లంతైన వారిలో మరో 11 మంది జాడ కనిపించడం లేదు. తుపాను హెచ్చరికలను కెప్టెన్ బల్విందర్ సింగ్ పెడచెవిన పెట్టడం వల్లే ఈ దుర్ఘటనకు కారణమని బార్జ్ చీఫ్ ఇంజినీర్ రహ్మాన్ షేక్ ఆరోపించారు.

మరోవైపు, ఈ ఘటనపై శివసేన సీరియస్ అయింది. ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఓఎన్‌జీసీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కాగా, అరేబియా సముద్రంలోని ఓఎన్‌జీసీ రిగ్గుల వద్ద పనిచేస్తున్న కార్మికులకు బార్జ్ నౌకలు ఆశ్రయ కేంద్రాలుగా ఉంటాయి.

More Telugu News