Lockdown: రైలు రాత్రి 11 గంటలకు.. ఉదయం 10 గంటల నుంచే నిరీక్షణ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల దుస్థితి!

  • ఉదయం 10 గంటల తర్వాత లేని ప్రయాణ సదుపాయం
  • పది గంటల తర్వాత బయలుదేరే రైళ్ల కోసం ఉదయం నుంచే నిరీక్షణ
  • పడరాని పాట్లు పడుతున్న ప్రయాణికులు
Railway passengers waiting for trains for almost 12 hours in telangana

తెలంగాణలో కరోనా లాక్‌డౌన్ రైలు ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. రైలు రోజులో ఎప్పుడు బయలుదేరినా ప్రయాణికులు మాత్రం ఉదయం 10 గంటలలోపే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం 10 గంటల తర్వాత బయలుదేరే రైళ్లను చేరుకునేందుకు ప్రజలు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది.

లాక్‌డౌన్ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉండడంతో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరినా ఉదయం 10 గంటలలోపే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి వస్తోంది. మరోవైపు, రైలు బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందే ప్రయాణికులను లోపలికి అనుమతిస్తుండడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, వర్షం పడడంతో నిన్న మాత్రం కొంత ముందుగానే స్టేషన్‌లోకి అనుమతించారు.

నాంపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. అయితే, ఆ సమయంలో రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ప్రయాణ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం 10 గంటల లోపే రైల్వే స్టేషన్‌కు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. దాదాపు 13 గంటలపాటు రైల్వే స్టేషన్‌లో కూర్చుంటూ నిమిషాలు లెక్కిస్తున్నారు. ఈ ఎదురుచూపులతో పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

More Telugu News