Britain: భయంకర పరిస్థితి... బ్రిటన్ లో 200 అడుగుల ఎత్తున నిలిచిన అతిపెద్ద రోలర్ కోస్టర్!

  • లాంక్ షైర్ లోని బ్లాక్ పూల్ ప్లెజర్ బీచ్ లో ఘటన
  • 213 అడుగుల ఎత్తులో కదలాల్సిన రోలర్ కోస్టర్
  • 200 అడుగుల ఎత్తున ఆగడంతో ఆందోళన
  • క్షేమంగా కిందకు దిగివచ్చిన రైడర్లు
Roller Coster Struck 200 Feet High in Britain

రోలర్ కోస్టర్... ఎంత థ్రిల్ ను ఇస్తుందో ఎక్కిన ప్రతి ఒక్కరికీ అనుభవమే. చిన్నదైనా, పెద్దదైనా రోలర్ కోస్టర్ ఎక్కేందుకు ఎంతో మంది ఆసక్తిని చూపిస్తుంటారు. మరెంతో మంది భయపడుతుంటారు. అదే సమయంలో మరెంతో మంది ఎక్కి ఆనందిస్తుంటారు కూడా. అటువంటిదే ప్రపంచంలోని అతిపెద్ద రోలర్ కోస్టర్ అయ్యుండి, అది గాల్లో నిలిచిపోతే... ఆ ఊహే ఎంతో భయానకంగా అనిపిస్తోంది కదా.అదే జరిగింది లండన్ లో.

ఇక్కడి లాంక్ షైర్ ప్రాంతంలో బ్లాక్ పూల్ ప్లెజర్ బీచ్ లో వరల్డ్స్ మోస్ట్ హయ్యస్ట్ గా పేరున్న రోలర్ కోస్టర్ మధ్యలోనే ఆగిపోయింది. 1994లో దీన్ని ప్రారంభించారు. ఇది దాదాపు 213 అడుగుల ఎత్తుంటుంది. దాదాపు రెండు సంవత్సరాల పాటు ఇదే అతిపెద్ద రోలర్ కోస్టర్. అటువంటి ఇది 200 అడుగుల ఎత్తున సాంకేతిక కారణాలతో నిలిచిపోగా, దాన్ని ఎక్కిన వారంతా అంత ఎత్తులో నుంచి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఒక్కొక్కరిగా కిందకు దిగాల్సి వచ్చింది.

లాంక్ షైర్ లైవ్ అందించిన వివరాల ప్రకారం, రోలర్ కోస్టర్ ఆగిపోగానే, ఈ థీమ్ పార్క్ స్టాఫ్ వెంటనే స్పందించి, ఒక్కొక్కరూ నెమ్మదిగా కిందకు వచ్చేందుకు తమవంతు సహకారాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఇక పై నుంచి కిందకు నెమ్మదిగా నడిచి వస్తున్న వేళ తాము ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నామని దీన్ని ఎక్కిన ఓ ఫేస్ బుక్ యూజర్ వ్యాఖ్యానించాడు.

ఈ రోలర్ కోస్టర్ ను మరింత ఎత్తునకు తీసుకుని వెళ్లి వదలాల్సిన మెషీన్ లో సమస్య తలెత్తడంతోనే ఈ ఘటన సంభవించిందని, రైడర్లు ఎవరూ ఎటువంటి ప్రమాదం లేకుండా కిందకు వచ్చారని బ్లాక్ పూల్ ప్లెజర్ బీచ్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. మెషీన్ కు మరమ్మతుల అనంతరం రోలర్ కోస్టర్ ను తిరిగి ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ ఘటన ఆదివారం నాడు జరుగగా, వీడియోలు వైరల్ అయిన తరువాత ఆలస్యంగా ప్రపంచ మీడియా దృష్టికి వచ్చింది.

More Telugu News