Narendra Modi: కరోనా విపత్తు నేపథ్యంలో సైన్యం సహాయ సహకారాలపై ప్రధాని మోదీ సమీక్ష

  • దేశంలో కరోనా విశ్వరూపం
  • ప్రధాని మోదీతో సీడీఎస్ బిపిన్ రావత్ సమావేశం
  • సైన్యం చేపడుతున్న చర్యలను ప్రధానికి వివరించిన రావత్
  • రిటైరైన డాక్టర్లను కూడా రంగంలోకి దించామని వెల్లడి
  • మారుమూల ప్రాంతాలకు కూడా సేవలు అందాలన్న మోదీ
PM Modi reviews covid relief measures taken by Army and other forces

కొవిడ్ మహమ్మారి కారణంగా దేశంలో భయానక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు సునామీని తలపించేలా నమోదవుతున్న తరుణంలో సైన్యం చేపడుతున్న సహాయక చర్యలపై ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తో చర్చించారు. ఈ సందర్భంగా కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు సైన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో రావత్ ప్రధానికి వివరించారు.

సైన్యం నుంచి రిటైరైన వైద్య నిపుణులు, గడచిన రెండేళ్లలో ముందుగానే పదవీ విరమణ చేసిన వైద్య నిపుణులను తిరిగి విధుల్లోకి తీసుకున్నామని రావత్ తెలిపారు. వారు ప్రస్తుతం ఉంటున్న ప్రదేశానికి సమీపంలోని కొవిడ్ కేర్ కేంద్రాల్లో వారి సేవలు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఇతర విశ్రాంత వైద్యాధికారుల సేవలను అత్యవసర సేవల హెల్ప్ లైన్లలో సమాచారం అందించేందుకు ఉపయోగిస్తున్నామని రావత్ తెలిపారు.

అంతేకాదు, సైనిక, నేవీ, వాయుసేన కమాండ్ హెడ్ క్వార్టర్లు, కార్ప్స్ హెడ్ క్వార్టర్లు, డివిజన్ హెడ్ క్వార్టర్లకు చెందిన డాక్టర్లను కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు తరలిస్తున్నామని ప్రధానికి వివరించారు. డాక్టర్లతో పాటు పెద్ద సంఖ్యలో నర్సులను కూడా నియమించామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ సైనిక స్థావరాల్లో ఉన్న ఆక్సిజన్ నిల్వలను ఆసుపత్రులకు తరలిస్తున్నామని, సాధారణ ప్రజలకు సేవలు అందించే వీలున్న చోట సైన్యం ప్రత్యేకంగా వైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని వివరించారు.

కాగా, ఈ సమావేశంలో ప్రధాని మోదీ వాయుసేన చేపడుతున్న ఆక్సిజన్, ఇతరత్రా తరలింపు కార్యాచరణను కూడా సమీక్షించారు. మారుమూల ప్రాంతాలకు కూడా కొవిడ్ కట్టడి సేవలు అందేలా చూసేందుకు కేంద్రీయ, రాజ్య సైనిక సంక్షేమ బోర్డుల అధికారుల సేవలు తీసుకోవాలని, వారిని సమన్వయకర్తలుగా నియమించి, కరోనా నియంత్రణ కార్యక్రమాలు సాఫీగా జరిగేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ సీడీఎస్ బిపిన్ రావత్ కు నిర్దేశించారు.

More Telugu News