Sanchaita: కరోనా వ్యాప్తి కారణంగా సింహాద్రి అప్పన్న కల్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహిస్తున్నాం: సంచయిత

  • ఏపీలో కరోనా విలయం
  • భక్తుల్లేకుండానే సింహాద్రి అప్పన్న కల్యాణోత్సవం
  • నిరాశ కలిగించే నిర్ణయమన్న సంచయిత
  • కరోనా వ్యాప్తి కారణంగా తప్పడంలేదని వివరణ
Sanchaita Gajapati says Simhadri Swamy Kalyanotsavam without devotees

కరోనా వైరస్ భూతం అన్ని అంశాలను ప్రభావితం చేసేంతగా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంపైనా కరోనా ప్రభావం పడింది. ఇక్కడి సింహాద్రి అప్పన్న కల్యాణోత్సవం ఈసారి ఏకాంతంగానే జరపాలని నిర్ణయించామని ఆలయ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి వెల్లడించారు. భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

రాత్రి 9 గంటల నుంచి సింహాద్రి స్వామి, ఆండాళ్ అమ్మవారి కల్యాణ మహోత్సవం ఆన్ లైన్ లో (https://www.youtube.com/watch?v=M_gFbdLzweY&feature=youtu.be) ఈ లింకు ద్వారా వీక్షించవచ్చని సంచయిత తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుకున్న చాలామంది భక్తులకు ఇది నిరాశ కలిగించే పరిణామం అని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ కొవిడ్ వ్యాప్తి అధికస్థాయిలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని స్పష్టం చేశారు.

ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ, శానిటైజేషన్, భౌతికదూరం పాటిస్తూ కరోనా నివారణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది కల్యాణోత్సవంలో భక్తులకు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లభిస్తుందని ఆశిద్దాం అని సంచయిత పేర్కొన్నారు.

More Telugu News