Chandrababu: తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు: చంద్రబాబు ఆరోపణ

  • తిరుపతి పార్లమెంటు స్థానానికి నేడు ఉప ఎన్నిక
  • తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం
  • వందలమందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించామన్న చంద్రబాబు
  • అధికారులు, పోలీసులున్నది జగన్ కోసం కాదని వ్యాఖ్యలు
  • తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో రీపోలింగ్ కు డిమాండ్
Chandrababu alleges huge number of outsiders rushed into Tirupati

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇవాళ తిరుపతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని, ఇక్కడికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని ఆరోపణలు చేశారు. బందిపోట్లను తలపించేలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.

పోలింగ్ నేపథ్యంలో సరిహద్దులు మూసేసి, తనిఖీలు చేసి పంపించాల్సిందని అన్నారు. కానీ పోలీసులు ఎందుకు చెక్ పోస్టులు ఎత్తివేశారని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల నుంచి వేలమంది వస్తే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు, అధికారులు ఉన్నది జగన్ అనే వ్యక్తి కోసం కాదని... పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలని హితవు పలికారు.

మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో వేలమందిని ఉంచారని చంద్రబాబు ఆరోపించారు. బయటి వ్యక్తులు తిరుపతిలో ఉంటే పోలీసులు ఎందుకు గుర్తించలేదని నిలదీశారు. దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరుకు చెందిన పెద్దిరెడ్డి తిరుపతిలో ఎందుకున్నారని ప్రశ్నించారు. తిరుపతి ప్రాంతానికి పెద్ద సంఖ్యలో జనాన్ని తీసుకువచ్చి పర్యాటకులు అంటున్నారని విమర్శించారు.

ఉప ఎన్నిక పోలింగ్ కోసం కేంద్రం పంపిన బలగాలు ఏమయ్యాయి? వెబ్ కాస్టింగ్ నిర్వహణ ఏమైంది? మేం వందలమందిని రెండ్ హ్యాండెడ్ గా పట్టించాం అని అన్నారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా చోటు చేసుకుంటున్న అన్ని అక్రమాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే, వైసీపీ మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు.

పోలీసులు, పోలింగ్ సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించే బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో జరిగిన పోలింగ్ అక్రమాల మయం అని, ఇక్కడి పోలింగ్ ను రద్దు చేయాలని కోరుతున్నామని తెలిపారు. పూర్తిగా కేంద్ర బలగాలు, సిబ్బందితో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని, తద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని అన్నారు.

More Telugu News