New Delhi: ఎర్రకోటపై దాడి కేసులో.. దీప్​ సిద్ధూకు బెయిల్​

  • ట్రాక్టర్ ర్యాలీలో హింసకు అతడే కారణమన్న పోలీసులు
  • బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి
  • దీప్ నిజాయతీపరుడన్న అతని లాయర్ 
  • వాదనల అనంతరం బెయిల్ మంజూరు చేసిన కోర్టు 
Deep Sidhu Granted Bail In Red Fort Violence Case

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎర్రకోట వద్ద జరిగిన హింస కేసులో పంజాబీ సింగర్ దీప్ సిద్ధూకు బెయిల్ మంజూరైంది. ఎర్రకోటపై దాడిచేసేలా ఇతరులను దీప్ సిద్ధూ ప్రేరేపించారన్న ఆరోపణలతో అతడిపై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అయితే, అతడు తప్పించుకుని తిరుగుతుండడంతో, అతని ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల నజరానానూ ప్రకటించారు. తర్వాత కొన్ని రోజులకే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దీప్ సిద్ధూను అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా అతడు జైలులోనే ఉన్నాడు.

ఈ క్రమంలోనే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు. గత సోమవారం పిటిషన్ విచారణ సందర్భంగా తీర్పును వాయిదా వేసింది. తాజాగా ఈరోజు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఆందోళనల వద్ద ఉన్నంత మాత్రాన అతడు ఇతరులను రెచ్చగొట్టినట్టు కాదని, రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతునిచ్చిన నిజాయతీ పరుడని దీప్ సిద్ధూ తరఫు లాయర్ వాదించారు.

అయితే, ఢిల్లీ పోలీసుల తరఫు లాయర్ వాదిస్తూ.. హింసను ప్రేరేపించే ఉద్దేశంతోనే దీప్ సిద్ధూ అక్కడకు వెల్లారని, ఎర్రకోటపై దాడి జరగడానికి ప్రధాన కారణం అతడేనని అన్నారు. అతడికి ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదని, ఇస్తే ఇంతకుముందు రెండు ఫోన్లను పగులగొట్టినట్టే ఇప్పుడూ సాక్ష్యాధారాలను మాయం చేస్తాడని ఆరోపించారు. అయితే, ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు.. దీప్ సిద్ధూకు బెయిల్ ను ఇస్తూ తీర్పునిచ్చింది.

రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఎంత హింసాత్మకమైందో తెలిసిందే. పోలీసులందరిపైనా రైతులు దాడులకు తెగబడ్డారు. ఎర్రకోటపై జాతీయ జెండాను తీసేసి సిక్కు జెండాను ఎగరేశారు. ప్రతిగా పోలీసులూ రైతులపై లాఠీ చార్జీ చేశారు.

More Telugu News