MS Dhoni: వయసు మీద పడినట్టు అనిపిస్తోంది: ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు

  • నిన్న 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ధోనీ
  • పంజాబ్ కింగ్స్ పై గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
  • తన ప్రయాణంపై మాట్లాడిన ధోనీ
Dhoni Says He Feel Very Old

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్ ఓడిన ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, నిన్న రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఐపీఎల్ లో ధోనీకి ఇది 200వ మ్యాచ్. తానాడుతున్న 200వ మ్యాచ్ లో తన జట్టు విజయం సాధించడం ద్వారా ధోనీకి సహచరులు మంచి బహుమతినే అందించారు.

ఇక ఈ మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ, ఇదే విషయాన్ని ప్రస్తావించి, ఈ అంకెలను తలచుకుంటే, వయసు మీద పడినట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చెన్నై సూపర్ కింగ్స్ తో తన ప్రయాణం ప్రారంభమైన క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు. సీఎస్కేతో తన జర్నీ ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పలేనని అన్నారు.

 "2011లో అనుకుంటా. చెన్నై వికెట్ నాకు ఆనందాన్ని కలిగించింది. ఆపై పరిస్థితులు మారాయి. పిచ్ క్యూరేటర్లు, మైదానం సిబ్బంది శ్రమించినా, పిచ్ పెద్దగా సహకరించింది లేదు" అని అన్నారు. వాంఖడేలో మంచి పిచ్ లను తయారు చేస్తున్నారని, ఇండియాలోని పరిస్థితులకు తగ్గట్టుగా ఇక్కడి మైదానాలు తయారవుతున్నాయని, సీమ్ కు, బౌన్స్ కు ఇదే సమయంలో నిలదొక్కుకుంటే పరుగులు తీయడానికి కూడా అనుకూలంగా ఉన్నాయని అన్నారు.

కాగా, తాజా మ్యాచ్ లో దీపక్ చాహార్, తానేసిన నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసుకోవడంతో, పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం 106 పరుగులకు పరిమితం కాగా, ధోనీ సేన సులువుగా ఈ లక్ష్యాన్ని అధిగమించింది. మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరాన్ వికెట్లను తీసుకున్న చాహార్ ను ప్రశంసించిన ధోనీ, చాహార్ ఇప్పుడు డెత్ ఓవర్లలో ప్రభావశీలిగా అవతరించాడని, పిచ్ సహకరించకున్నా, ఫలితాలను పొందుతున్నాడని అన్నారు.

ఇక బౌలింగ్ పరంగా తమ వద్ద ఎన్నో వనరులు ఉన్నాయని, తనకు ఎటాకింగ్ చేయడమే ఇష్టమని చెప్పుకొచ్చారు. మోయిన్ అలీని నంబర్-3గా ప్రమోట్ చేయడం వెనుక తమ వ్యూహాలు ఉన్నాయని, అతన్ని మరింతగా వాడుకోవాలని భావించిన మీదటే, ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

More Telugu News