Chandulal: టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ హఠాన్మరణం!

  • ఉమ్మడి ఏపీ, టీఎస్ లలో మంత్రిగా సేవలు
  • నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన చందూలాల్
  • తీవ్ర సంతాపం వెలిబుచ్చిన కేసీఆర్
TS Ex Minster Azmira Chandulala Passes Away

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణలో మంత్రిగా సేవలందించిన అజ్మీరా చందూలాల్ తీవ్ర అనారోగ్యం కారణంగా హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఆయనకు భార్య శారద, కుమారుడు ప్రహ్లాద్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

 ప్రస్తుతం ములుగు జిల్లా పరిధిలో ఉన్న జగ్గన్నపేటలో 1954 ఆగస్టు 17న జన్మించిన ఆయన, ఎంపీగా, ఎమ్మెల్యేగా పలుమార్లు విజయం సాధించారు. ఇటీవల ఆయన కిడ్నీలు విఫలం కాగా, కిడ్నీ మార్పిడి జరిగింది. అప్పటి నుంచి డయాలసిస్ పైనే ఆధారపడిన ఆయన, ఇటీవల మరోమారు అనారోగ్యానికి గురై, చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని కిమ్స్ లో చేరారు. పరిస్థితి విషమించి, గురువారం రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆపై 1994లో మరోమారు ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు. 2014 ఎన్నికల్లో మరోమారు విజయం సాధించి, నూతన తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక, గిరిజన శాఖలను నిర్వహించారు.

ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఓడిపోయి, రాజకీయాలకు కాస్తంత దూరం అయ్యారు. చందూలాల్ మరణ వార్తను తెలుసుకున్న కేసీఆర్, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబీకులకు సంతాపం తెలిపారు. రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి ఆయన ఎంతో శ్రమించారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.

"మాజీ మంత్రివర్యులు శ్రీ అజ్మీరా చందూలాల్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని మరో మంత్రి ఈటల రాజేందర్ తన ట్విట్టర్ ఖాతాలో సంతాపం తెలిపారు.

More Telugu News