AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో సీబీఐ మాజీ జేడీ పిటిషన్... కేంద్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు

  • విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేసిన వీవీ లక్ష్మీనారాయణ
  • పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
  • నాలుగు వారాల్లోపు కేంద్రం స్పందించాలన్న న్యాయస్థానం
AP High Court issues notices to Union Government

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లక్ష్మీనారాయణ తన వ్యాజ్యంలో కోరారు. ప్రైవేటీకరణతో సమస్యలు తీరవని, స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి బాటలో నడిపేందుకు ఇతర మార్గాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. కేంద్రం నాలుగు వారాల్లోపు స్పందించాలని స్పష్టం చేసింది.

కాగా, లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్రానికి లేఖ కూడా రాశారు. పరిశ్రమను ఎలా లాభాల బాట పట్టించవచ్చో తన ఆలోచనలను పంచుకున్నారు. అంతేకాదు, అతిపెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలో ఉపయోగించిన ఉక్కును, ముంబయి-నాగ్ పూర్ హైవే నిర్మాణంలో ఉపయోగించిన ఉక్కును విశాఖ స్టీల్ ప్లాంటే ఉత్పత్తి చేసిందని వివరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలికిన ఆయన ఎప్పటికప్పుడు కార్మిక సంఘాలతో మాట్లాడుతూ కార్యాచరణను ముందుకు తీసుకెళుతున్నారు.

More Telugu News