Dr Reddys Laboratories: మే మధ్య వారం నాటికి భారత్​ కు స్పుత్నిక్​ వ్యాక్సిన్లు!

  • ఈ నెలలోనే దిగుమతులు మొదలయ్యే అవకాశం
  • జులై – సెప్టెంబర్ మధ్య దేశంలో ఉత్పత్తి మొదలు
  • 12.5 కోట్ల డోసుల ఉత్పత్తికి రెడ్డీస్ ఒప్పందం
Sputnik doses may be shipped to India mid May

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వికి రెండ్రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చేసింది. భారత్ లో ఆ వ్యాక్సిన్లను తయారు చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ తో పాటు మరికొన్ని సంస్థలతో రష్యా ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెలలోనే రష్యా నుంచి టీకాల దిగుమతి మొదలవుతుందని డాక్టర్ రెడ్డీస్ కు చెందిన ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ – జూన్ మధ్య వ్యాక్సిన్ డోసులు వస్తాయంటున్నారు. అదే విధంగా జులై – సెప్టెంబర్ మధ్య మన దేశంలో ఉత్పత్తి మొదలవుతుందని చెబుతున్నారు.

ఫస్ట్ బ్యాచ్ లో వచ్చిన డోసులను కేంద్ర ప్రభుత్వం టెస్ట్ చేసి ఓకే చెప్పిన తర్వాత మే మధ్య నాటికి అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దిగుమతులతో పాటు ఇక్కడ తయారు చేసే డోసులు కలిపి 12.5 కోట్ల డోసులకు ఒప్పందం చేసుకున్నామని, పరస్పర చర్చల అనంతరం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని రెడ్డీస్ ఏపీఐ అండ్ ఫార్మాస్యుటికల్ సర్వీసెస్ సీఈవో దీపక్ సాప్రా చెప్పారు.

మన దేశంలో వ్యాక్సిన్ సరఫరా దారిలో పడేంత వరకు ఆ వ్యాక్సిన్లను భారత్ అవసరాలకు మాత్రమే అందుబాటులో ఉంచుతామన్నారు. ఆ తర్వాతే విదేశాలకు స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తామన్నారు. ప్రపంచంలో తయారయ్యే స్పుత్నిక్ వ్యాక్సిన్లలో 70 శాతం దాకా ఇక్కడే ఉత్పత్తవుతాయన్నారు. వ్యాక్సిన్ ఎక్స్ఫైరీ గడువు ఆరు నెలల పాటు ఉంటుందన్నారు. ప్రస్తుతం మైనస్ 18 డిగ్రీల నుంచి మైనస్ 22 డిగ్రీల శీతల పరిస్థితుల్లోనే వ్యాక్సిన్ ను నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు.

అయితే, 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా వ్యాక్సిన్ ను నిల్వ చేసుకునేలా డేటాను చెక్ చేస్తున్నామన్నారు. కొన్ని నెలల్లో ఆ సమాచారం అందుబాటులోకి వస్తుందని, ఆ తర్వాత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఆ డేటాను సమర్పించి నిల్వ సమచారంలో సవరణలు చేస్తామన్నారు. కాగా, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా బెంగళూరుకు చెందిన శిల్ప మెడికేర్ అనే సంస్థతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News