Nagarjuna Sagar Bypolls: ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో గ్రహించి ఓటు వేయాలి: హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌

  • లిఫ్టులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ
  • నందికొండలో డిగ్రీ కళాశాలకు హామీ
  • 30 ఏళ్లలో జానారెడ్డి చేసింది శూన్యమని విమర్శ
  • ఉపఎన్నిక కోసం కేంద్రమంత్రులు వస్తున్నారంటూ బీజేపీపై విమర్శలు
  • పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామన్న సీఎం
CM KCR Urges Nagarjuna sagar voters to vote for development

ఎవరు గెలిస్తే నాగార్జునసాగర్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో గ్రహించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్యను కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కురిపించే ఓట్లలాగే నెల్లికల్‌ లిఫ్టు నుంచి నీళ్లు దూకుతాయని హామీ ఇచ్చారు.

నెల్లికల్ తో పాటు ఉమ్మడి నల్గొండ కోసం మంజూరు చేసిన దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్‌ లిఫ్టులన్నింటినీ పూర్తి చేసి తీరతామని హామీ ఇచ్చారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని తెలిపారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా నేడు కేసీఆర్‌ హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.  

ఒక ఉప ఎన్నిక కోసం ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు వస్తున్నారని పరోక్షంగా బీజేపీపై కేసీఆర్‌ విమర్శలు చేశారు. నందికొండకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న జానారెడ్డి 30 ఏళ్లలో హాలియాకు డిగ్రీ కళాశాలను కూడా తీసుకురాలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం పాకులాడతారన్నారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లాగా వదులుకున్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం పదవుల కోసం తెలంగాణను తాకట్టు పెట్టారన్నారు.

తెరాస ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ సందర్భఃగా కేసీఆర్‌ ప్రజలకు వివరించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ పథకాలు గతంలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. పైరవీలు, మధ్యవర్తులు లేకుండా అందరికీ రైతుబంధు అందిస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ పేరిట ఇంటింటికీ అందిస్తున్న నల్లానీటిలో కేసీఆర్‌ కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. గిరిజనుల పోడు భూముల సమస్యను ప్రజాదర్భార్ పెట్టి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కుల, మత, జాతి వంటి భేదం లేకుండా ప్రతి వర్గం కోసం తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని కేసీఆర్‌ తెలిపారు. ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు హాలియాలో షాదీఖానా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో భగత్‌ గెలిస్తే నియోజకవర్గానికి చెందిన కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేయడం ఖాయమని తెలిపారు. అలాగే ఇటీవల పార్టీలో చేరిన బీజేపీ నేత కడారి అంజయ్యకు సైతం పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు.

More Telugu News