CBSE Exams: సీబీఎస్ఈ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం!

  • 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన కేంద్రం
  • 10వ తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు
  • ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం
CBSE 12 class exams postponed and 10 class exams cancelled

కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్రం వాయిదా వేసింది. 10వ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఉన్నతస్థాయి అధికారులతో మోదీ నిర్వహించిన సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

మే 4 నుంచి జూన్ 14 వరకు జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి జూన్ 1న నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరీక్షలకు 15 రోజుల ముందుగానే విద్యార్థులకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ బోర్డు రూపొందించిన ఆబ్జెక్టివ్ విధానం ద్వారా రిజల్ట్స్ విడుదల చేస్తామని... ఈ విధానం ద్వారా వచ్చిన మార్కులతో ఏ విద్యార్థి అయినా తృప్తి చెందకపోతే... పరిస్థితులు అనుకూలించిన తర్వాత పరీక్ష రాసేందుకు అనుమతినిస్తామని చెప్పారు.

మరోవైపు, ఈనాటి సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, విద్యార్థులు సురక్షితంగా ఉండటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం తమకు ముఖ్యమని... ఇదే సమయంలో వారి విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More Telugu News