IIT Madras: ఐఐటీ మద్రాస్​ నుంచి దేశీ ఫ్లయింగ్​ ట్యాక్సీ ఆవిష్కరణ!

  • ఈ ఏడాది జులైలో చిన్నపాటి ప్రొటోటైప్ పరీక్ష
  • 10 నిమిషాల్లో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం
  • ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల జర్నీ
  • అర కిలోమీటరు నుంచి 2 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణం
  • సాధారణ ట్యాక్సీల కన్నా ఒకటిన్నర రెట్ల చార్జీ
Coming soon from IIT Madras stable Flying taxis

మిగతా ట్యాక్సీలకన్నా పది రెట్ల వేగం.. పది నిమిషాల్లో కరిగిపోయే పది కిలోమీటర్ల దూరం.. సౌండ్ చేయదు.. కాలుష్యానికి కారణం కాదు.. ఖర్చు కూడా తక్కువ.. ఇవన్నీ ఉన్నా అది నేల మీద పరుగులు తీసే కారు కాదు. గాలిలో ఎగిరే ట్యాక్సీ అది. చిటికెలో బుక్ చేస్తే చటుక్కున మన ఇంటి డాబాపై వచ్చి వాలుతుంది. మనల్ని ఎక్కించుకుని గమ్యస్థానానికి చేరుస్తుంది. ఇది ఐఐటీ మద్రాస్ లో పుట్టిన ‘ద ఈ ప్లేన్ కంపెనీ’ సృష్టించిన ఫ్లయింగ్ ట్యాక్సీ.

బ్యాటరీతో నడిచే ఈ ట్యాక్సీ.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. ఇద్దరు ప్రయాణించేందుకు వీలుగా దీనిని డిజైన్ చేశారు. అయితే, దానిని టెస్ట్ చేసేందుకు 50 కిలోల పేలోడ్ ను మోసే ఓ వెర్షన్ను కంపెనీ తయారు చేసింది. ఈ ఏడాది జులైలోనే దానిని పరీక్షించనుంది. తుది ప్రొటోటైప్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫ్లయింగ్ ట్యాక్సీకి రన్ వేలు అవసరం లేదని, నిట్టనిలువుగా ఎగురుతుందని, అదే నిట్ట నిలువుగానే ల్యాండ్ అవుతుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి చెప్పారు. అర కిలోమీటరు నుంచి 2 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతుందన్నారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని, ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 10 నుంచి 20 ట్రిప్పుల వరకు ప్రయాణిస్తుందని చెప్పారు.

సాధారణ ట్యాక్సీల కన్నా చార్జీలు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని సత్య చక్రవర్తి చెప్పారు. అయితే, ఇవి ఎక్కువగా అందుబాటులోకి వస్తే.. సాధారణ ట్యాక్సీల్లాగానే చార్జీలు ఉంటాయన్నారు. ప్రస్తుతానికి చార్జీలు కొంచెం ఎక్కువైనా ట్రాఫిక్ ఇబ్బందులను ఇది తప్పిస్తుందన్నారు. 10 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుతుందన్నారు.

తమ ఫ్లయింగ్ ట్యాక్సీకి సంబంధించి సాంకేతికంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఆయన చెప్పారు. వేగం తగ్గించేందుకు ట్యాక్సీకి రెక్కలు చాలా పెద్దవిగా ఉండాల్సిన అవసరం ఉంటుందని, దాని వల్ల వాహనం బరువు పెరిగి ఎగరడం కొంచెం కష్టమవుతుందని చెప్పారు. దీనిపైనే దృష్టిపెట్టి రోటర్స్ తయారు చేశామని, దానిపై పేటెంట్ కూడా తీసుకున్నామని వివరించారు. దీంతో తమ ఫ్లయింగ్ ట్యాక్సీకి చిన్న రెక్కలనే అమర్చామన్నారు. త్వరలోనే ఫ్లయింగ్ ట్యాక్సీని సాకారం చేస్తామన్నారు.

అయితే, నగరాల్లో వాయు మార్గాలకు సంబంధించి పౌర విమానయాన శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. అంతేగాకుండా ఆయా చోట్ల హెలిప్యాడ్ల నిర్మాణంపైనా కసరత్తులు చేస్తామన్నారు. వాస్తవానికి ముగ్గురు లేదా నలుగురు పట్టేలా ట్యాక్సీని రూపొందించాలనుకున్నట్టు చక్రవర్తి వివరించారు.

More Telugu News