Monsoon: దేశంలో ఈ ఏడాది రుతుపవనాలపై అంచనాలు ఇవిగో!

  • మరో రెండు నెలల్లో రుతుపవనాల సీజన్
  • జూన్ లో నైరుతి పవనాల రాక
  • వ్యవసాయ రంగానికి శుభవార్త చెప్పిన స్కైమెట్
  • 103 శాతం వర్షపాతం నమోదవుతుందని వెల్లడి
  • కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం
Monsoon season expectations in country

మరో రెండు నెలల్లో దేశంలో రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. వేసవి కాలం చివర్లో అరేబియా సముద్రం నుంచి భారత్ లోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. కాగా, ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఈ సంవత్సరానికి సంబంధించి అంచనాలను రూపొందించింది. వరుసగా మూడో ఏడాది కూడా రుతుపవనాలు ఎలాంటి తగ్గుదల లేకుండా సాధారణ వర్షపాతం అందిస్తాయని వెల్లడించింది.

భారత్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం అని తెలిసిందే. వ్యవసాయ రంగంలో చోటుచేసుకునే పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రుతుపవనాల సీజన్ ఆశాజనకంగా ఉంటుందన్న స్కైమెట్ ప్రకటన సంతోషకరమైన వార్తేనని చెప్పాలి. జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాగే నైరుతి సీజన్ లో 103 శాతం (5 శాతం అటూ ఇటూగా) వర్షపాతం నమోదవుతుందని, సగటున 880.6 మిమీ వర్షపాతం అందిస్తుందని స్కైమెట్ వివరించింది.

2021లో క్షామ పీడిత పరిస్థితులకు అవకాశమేలేదని, వర్షాభావ పరిస్థితులు చోటుచేసుకునే పరిణామాలకు ఆస్కారం లేదని అభిప్రాయపడింది. అయితే ఉత్తర భారతదేశంలోని కొన్ని మైదాన ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు తక్కువ వర్షపాతం నమోదు చేస్తాయని పేర్కొంది. జూలై-ఆగస్టు నడుమ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఇలాంటివి మినహాయిస్తే మొత్తమ్మీద దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ స్థితిలోనే ఉంటుందని స్కైమెట్ వెల్లడించింది.

More Telugu News