Japan: అణు వ్యర్థ జలాలను సముద్రంలోకి వ‌దిలిపెట్టాల‌ని జ‌పాన్ నిర్ణ‌యం.. విమ‌ర్శ‌ల వెల్లువ!

  • గ‌తంలో సునామీని ఎదుర్కొన్నజ‌పాన్‌
  • దెబ్బ‌తిన్న ఫుకుషిమా అణు విద్యుత్తు కేంద్రం
  • పేరుకుపోయిన 1.25 మిలియన్‌ టన్నుల వ్య‌ర్థ‌జ‌లాలు
japan to release waste water

గ‌తంలో సునామీని ఎదుర్కొన్న జ‌పాన్‌లో ఫుకుషిమా అణు విద్యుత్తు కేంద్రం దెబ్బతింది. దీంతో దాదాపు. 1.25 మిలియన్‌ టన్నుల వ్య‌ర్థ‌జ‌లాల‌ను అక్కడి తొట్టెల్లో నిల్వ ఉంచారు. ఇప్పుడు ఆ వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలిపెట్టాల‌ని జపాన్‌ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీనిపై స్థానిక మత్స్యకార వర్గాలతో పాటు చైనా ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  

ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమైన చర్య అంటూ చైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ ప్ర‌క్రియ‌ను జపాన్ చాలా కాలం క్రిత‌మే ప్రారంభించాల్సి ఉండ‌గా, వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇప్పుడు కూడా వివాదం రాజుకోవ‌డంతో మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది. అయితే, జపాన్‌ చర్యను అంతర్జాతీయ అణుశక్తి కమిషన్‌ (ఐఏఈఏ) సమర్థిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అణుకేంద్రాల వద్ద జరిగే చర్యవంటిదే ఇదని చెప్పింది.  

జపాన్‌ ప్రధాని యషిహిడే సుగా మంత్రి మండలి సమావేశంలో ఇదే విష‌యంపై మాట్లాడారు. అణు కేంద్రాన్ని మూసేయాలంటే  కొన్నేళ్లు ప‌డుతుంద‌ని, ఆ చర్యలో ఇది ఒక భాగమని తెలిపారు. త‌మ నిర్ణ‌యం స్వాగతించదగిన పరిణామమ‌ని చెప్పారు. తాము విడుద‌ల చేయ‌నున్న‌ నీరు సురక్షితమైందని తేలిన తర్వాతే సముద్రంలోకి విడుదల చేస్తామని చెప్పారు.

జ‌పాన్ విడుద‌ల చేయ‌నున్న ఈ నీటిలో అణు రియాక్టర్‌ను చల్లబర్చేందుకు వాడిన నీటితో పాటు వర్షపు నీళ్లు వంటివి ఉన్నాయి. వాటిని అత్యాధునిక అడ్వాన్స్‌డ్‌ లిక్విడ్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ వ్యవస్థ ద్వారా శుద్ధి చేసి స‌ముద్రంలోకి వ‌దులుతారు.

More Telugu News