February: ఫిబ్రవరిలో గణనీయంగా తగ్గిన పారిశ్రామికోత్పత్తి!

  • ఫిబ్రవరిలో కేవలం 3.6 శాతమే
  • కుదేలైన ఉత్పత్తి రంగం
  • ఫర్వాలేదనిపించిన కన్స్యూమర్ గూడ్స్, కాపిటల్ గూడ్స్ విభాగాలు
IIP Growth Collapse in February

ఇండియాలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు గడచిన ఫిబ్రవరి నెలలో 3.6 శాతానికి పడిపోయింది. కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, మాన్యుఫాక్చరింగ్ రంగం కుదేలు కావడంతోనే ఐఐపీ పడిపోయినట్టుగా తెలుస్తోంది. అంతకుముందు డిసెంబర్ లో 1.6 శాతం వృద్ధిని నమోదు చేసిన ఐఐపీ గణాంకాలు జనవరిలో 0.9 శాతంగానే నమోదైందన్న సంగతి తెలిసిందే. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి 11 నెలల్లో 8 నెలల పాటు ఐఐపీ గణాంకాలు దిగజారాయన్న సంగతి తెలిసిందే.

మొత్తంమీద 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, గత సంవత్సరం పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 11.3 శాతం మేరకు తగ్గాయి. తాజా గణాంకాలను పరిశీలిస్తే, 23 రంగాల్లో 17 రంగాల్లో వృద్ధి రేటు మందగించింది. అపారెల్, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, మెటల్స్, మెషినరీ ఇండస్ట్రీస్, పేపర్, వాహన, మౌలిక రంగాలన్నీ నష్టపోయాయి.

2020లో పాతాళానికి దిగజారిన పారిశ్రామికోత్పత్తి, జనవరిలో ఫర్వాలేదని పించినా, ఆపై మరోమారు దిగజారింది. ఇక, కరోనా కేసులు పెరుగుతుండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతుండటం, నైట్ కర్ఫ్యూల దిశగా దేశం సాగుతుండటంతో, తదుపరి మాసాల్లో సైతం ఐఐపీ గణాంకాలు అంత సంతృప్తికరంగా ఉండే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలావుండగా, ఫిబ్రవరిలో క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ తో పాటు వినియోగదారుడు ఆధారిత పరిశ్రమలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిత్యావసరాలు తదితర రంగాలు మాత్రం ఫర్వాలేదనిపించాయి. సమీప భవిష్యత్తులో వృద్ధి రేటు పెరగాలంటే, మాన్యుఫాక్చరింగ్ రంగం అత్యంత కీలకమని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News