Narendra Modi: మమతా బెనర్జీ క్లీన్ బౌల్డ్ అయ్యారు: మోదీ

  • నాపై కోపం ఉంటే తిట్టి కోపాన్ని తగ్గించుకోండి
  • బెంగాల్ ప్రజలు అసలైన మార్పును కోరుకుంటున్నారు
  • తొలి నాలుగు రౌండ్లలోనే బీజేపీ సెంచరీకి చేరువైంది
Mamata Banerjee clean bowled in Nandigram says Modi

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. 'దీదీ ఓ దీదీ' అంటూ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ క్లీన్ బౌల్డ్ అయ్యారని అన్నారు. ఎన్నికల బరి నుంచి వెళ్లిపోదామని టీఎంసీ నేతలు ఆమెను అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

'దీదీ మీకు నాపై కోపం ఉంటే... మీకు కావాల్సినంత దూషించండని' ప్రధాని అన్నారు. తనను తిట్టి కోపాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. అంతేకానీ, బెంగాల్ గౌరవం, సంస్కృతి తగ్గిపోయేలా  మాత్రం వ్యవహరించవద్దని అన్నారు. బర్దమాన్ లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మీ అహంకారాన్ని, దోపిడీని, కట్ మనీ సిండికేట్ ను బెంగాల్ ప్రజలు తట్టుకోలేకపోతున్నారని మోదీ వ్యాఖ్యానించారు. బెంగాల్ ప్రజలు అసలైన మార్పును కోరుకుంటున్నారని అన్నారు. తొలి నాలుగు విడతల పోలింగ్ లో బెంగాల్ ప్రజలు ఎన్నో బౌండరీలు కొట్టారని చెప్పారు. తొలి నాలుగు రౌండ్లలోనే బీజేపీ సెంచరీకి (వంద సీట్లు) చేరువైందని అన్నారు. మ్యాచ్ సగం ముగిసే సరికే టీఎంసీని ఓటర్లు స్వీప్ చేశారని చెప్పారు. మమతా బెనర్జీ నందిగ్రామ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యారని అన్నారు.

ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలపై ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడేలా మమత వ్యాఖ్యలు చేస్తున్నారని మోదీ విమర్శించారు. దళితులను కించపరుస్తూ తృణమూల్  పార్టీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను ప్రధాని ప్రస్తావిస్తూ, దీదీ తనను తాను రాయల్ బెంగాల్ టైగర్ నని చెప్పుకుంటుంటారని... 'మరి, ఆమె అనుమతి లేకుండా ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తారా?' అని ప్రశ్నించారు. మీరు చేసిన వ్యాఖ్యలతో అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు.

More Telugu News