Remdesivir: కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం... రెమ్ డెసివిర్ ఎగుమతులపై నిషేధం

  • దేశంలో కరోనా విలయం
  • పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్య
  • కరోనా చికిత్సలో కీలకంగా రెమ్ డెసివిర్ ఔషధం
  • నిల్వ చేస్తే చర్యలు తప్పవన్న కేంద్రం
  • వివరాలు వెబ్ సైట్లో పొందుపరచాలని ఆదేశాలు
Union govt bans exports of Remdesivir

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య లక్షకు పైబడుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగుల సంఖ్య రెట్టింపవుతుండడంతో చికిత్సలో ఉపయోగించే రెమ్ డెసివిర్ ఔషధానికి భవిష్యత్ లో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో దేశం నుంచి రెమ్ డెసివిర్ ఎగుమతులపై నిషేధం విధించింది. పంపిణీదారులు రెమ్ డెసివిర్ ను నిల్వచేయొద్దని స్పష్టం చేసింది. రెమ్ డెసివిర్ ఔషధ నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్లో ఉంచాలని పేర్కొంది. రెమ్ డెసివిర్ నిల్వలు బ్లాక్ మార్కెట్ కు తరలి పోకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించుకుంది.

యాంటీ వైరల్ డ్రగ్ గా సమర్థంగా పనిచేస్తుందని రెమ్ డెసివిర్ ఔషధంపై ప్రపంచ వైద్య నిపుణులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రస్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నవారికి ఈ ఔషధాన్నే చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజెక్షన్ ఒక్కటి రూ.5 వేల వరకు ఉంటుంది. అయితే దీనికున్న డిమాండ్ దృష్ట్యా గతేడాది హైదరాబాదులో రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలికినట్టు వార్తలొచ్చాయి. మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News