Telangana: తెలంగాణలో ప్రైవేటు టీచర్లకు రూ. 2 వేలు... ఎలా దరఖాస్తు చేయాలంటే..!

  • కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రైవేటుస్కూళ్ల టీచర్లు  
  • అర్హులకు 24లోగా రూ. 2 వేల సాయం
How to apply for Govt Help of 2000 for Private Teachers

కరోనా, లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూత పడటంతో, జీవనోపాధి లేక రోడ్డునపడ్డ ప్రైవేటుస్కూళ్ల టీచర్లను ఆదుకునేందుకు నెలకు రూ. 2 వేల సాయాన్ని, తిరిగి పాఠశాలలు తెరిచేంత వరకూ ఇవ్వాలని, దీనికి తోడు అదనంగా 25 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అర్హులైన టీచర్లందరికీ ఈ నెల నుంచే సాయం అందిస్తామని అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రైవేటు టీచర్లు ఈ సాయం కోసం ఎలా దరఖాస్తు చేయాలన్న విషయమై అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. వీటి ప్రకారం, గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం నుంచి అక్కడ పనిచేసే టీచర్ల వివరాలను ఆన్ లైన్ మాధ్యమంగా అధికారులు సేకరిస్తారు. ఈ వివరాలను స్కూళ్ల యాజమాన్యాలు "schooledu.telangana.gov.in" వెబ్ సైట్ లో నమోదు చేయాల్సి వుంటుంది.

టీచర్ల బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్ఈ కోడ్, ఆధార్ వివరాల నమోదు తప్పనిసరి. ఒకసారి దరఖాస్తు చేసిన తరువాత ఎంఈఓలు, డీఈఓలు తదితర అధికారులు తనిఖీలు చేసి, కలెక్టర్ ద్వారా విద్యాశాఖకు వివరాలు పంపుతారు. టీచర్ల వివరాల నమోదు ప్రక్రియ15వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఆపై 19 వరకూ వాటి పరిశీలన కొనసాగుతుంది. దాని తరువాత 24వ తేదీ లోపు టీచర్ల ఖాతాల్లో రూ. 2 వేలు జమ అవుతుందని, 21 నుంచి 25 లోపు వారికి రేషన్ షాపుల ద్వారా 25 కిలోల బియ్యం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏర్పాట్లన్నీ కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతాయని వెల్లడించింది. కాగా, ఈ పథకంలో భాగంగా మొత్తం 1.45 లక్షల మందికి సాయం చేయాల్సి వుండగా, ప్రభుత్వ ఖజానాపై రూ. 42 కోట్ల భారం పడుతుందని అంచనా.

More Telugu News