PV Prabhakar Rao: పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలంటూ తనయుడి ఆకాంక్ష

  • ఓ కార్యక్రమంలో పీవీ ప్రభాకర్ రావు వ్యాఖ్యలు
  • పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చారని వెల్లడి
  • దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని వివరణ
  • దేశ ప్రధానిగా విశిష్ట సేవలందించారని కితాబు
PV Prabhakar Rao hopes Union Govt will look into Bharataratna for PV Narasimharao

తెలుగుజాతి గర్వించదగిన రీతిలో జాతీయ రాజకీయాల్లో ఉన్నతస్థాయికి ఎదిగి, ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్లు ఇటీవల ఊపందుకున్నాయి. తాజాగా పీవీ తనయుడు ప్రభాకర్ రావు కూడా ఈ అంశంపై స్పందించారు.

 తన తండ్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ఆకాంక్షించారు. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని, ప్రధానిగా విశిష్ట సేవలు అందించారని పీవీ ప్రభాకర్ రావు అన్నారు. కళలు, సాహిత్యం అంటే ఎంతో ఆసక్తితో ఉండేవారని, జ్ఞాన్ పీఠ్ అవార్డు కమిటీ చైర్మన్ గానూ సేవ చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో పీవీకి భారతరత్న ఇచ్చే దిశగా కేంద్రం ఆలోచిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలుగుతేజం జాతీయ అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం అక్షర దీక్ష సాహిత్య కళా వేదిక ఆధ్వర్యంలో హైదరాబాదులోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పురస్కారాలు అందించారు.

More Telugu News