Erna Solberg: కరోనా నిబంధనలు ఉల్లంఘించిన నార్వే ప్రధాని.. జరిమానా వడ్డించిన పోలీసులు!

  • పుట్టినరోజు వేడుకల్లో నిబంధనల ఉల్లంఘన
  • 10 కంటే ఎక్కువ గుమికూడొద్దన్న నిబంధన అతిక్రమణ
  • 20 వేల క్రౌన్ల జరిమానా
  • పౌరుల బాధ్యతను పెంచడానికేనన్న పోలీసులు
Norway PM Fined for breaking corona rules

దేశ ప్రధాని అయినా.. సామాన్య పౌరుడైనా.. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్నారు నార్వే పోలీసులు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పరిమితికి మించి ఎక్కువ మందితో సమావేశమైన ఆ దేశ ప్రధానికి సైతం జరిమానా విధించారు. ప్రధానే బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే.. సామాన్య పౌరులేం పాటిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్ని మరింత అప్రమత్తం చేయడానికే ఇలా చేశామని చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే... ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నార్వేలోనూ విలయతాండవం చేస్తోంది. దీంతో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగా ఒక ప్రదేశంలో 10 మంది కంటే ఎక్కువ గుమికూడొద్దని ఆదేశించారు. అయితే, ఇటీవల ఆ దేశ ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్‌ 60వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే, ఈ సమావేశంలో మొత్తం 13 మంది పాల్గొన్నారు. ఇది కరోనా కట్టడి నిబంధనలకు విరుద్ధం.

దీనిపై తర్వాత ప్రధాని క్షమాపణలు కూడా చెప్పారు. చట్టం ముందు కొంతమందికి, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉన్నప్పటికీ.. ప్రధానికి జరిమానా విధించామని పోలీసులు తెలిపారు. నిబంధనల అమలులో ప్రధానే ముందుండాలని అభిప్రాయపడ్డారు. అందుకే 20,000 నార్వేజియన్‌ క్రౌన్స్‌ జరిమానాగా విధించామన్నారు. దీంతో సామాన్య పౌరులు సైతం అప్రమత్తమై బాధ్యతాయుతంగా మెలుగుతారని తెలిపారు.

More Telugu News