Vijayashanti: ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ సాయంపై తీవ్రస్థాయిలో స్పందించిన విజయశాంతి

  • తెలంగాణలో ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ సాయం
  • నెలకు రూ.2 వేలు నగదు, 25 కిలోల బియ్యం
  • ఆ డబ్బు ఏమూలకు సరిపోతుందన్న విజయశాంతి
  • ఎప్పుడో స్పందించి ఉండాల్సిందని వ్యాఖ్యలు
  • ఇన్ని ప్రాణాలు పోయేవి కావని వెల్లడి
Vijayasanthi comments on Govt help to private teachers

కరోనా సంక్షోభం నేపథ్యంలో తెలంగాణలోని 1.45 లక్షల మంది ప్రైవేటు టీచర్లకు వర్తించేలా నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిడం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో గత కొన్నినెలలుగా ప్రైవేటు టీచర్ల పరిస్థితి దారుణంగా తయారైందని తెలిపారు. అయితే టీచర్ల వరుస ఆత్మహత్యలు, పాలకుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర విమర్శలు రావడంతో తూతూ మంత్రంగా రూ.2 వేలు డబ్బు, 25 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆ డబ్బు ఏమూలకు సరిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తి కారణంగా నెలకొన్న పరిస్థితులు 30 మంది వరకు టీచర్లను ఆత్మహత్య దిశగా నడిపించాయని, మరెంతోమంది ఉద్యోగాలు కోల్పోయారని, కుటుంబ పోషణ కోసం బండ్లు నడుపుకుంటూ, కూరలు అమ్ముకుంటూ, కూలీలుగా మారిపోయారని వివరించారు. ఈ పరిస్థితులపై మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయని, అప్పుడే సర్కారు మేల్కొని ఉంటే, తమకు సర్కారు అండగా ఉంటుందన్న భరోసా కాస్తయినా ఇచ్చి ఉంటే ఇవాళ ఇన్ని ప్రాణాలు పోయేవి కావని విజయశాంతి వ్యాఖ్యానించారు.  

ప్రభుత్వ టీచర్లు అయినా, ప్రైవేటు టీచర్లు అయినా సమాజంలో గురువు స్థానం ఎప్పటికీ ఉన్నతమైనదేని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని, కాస్త డబ్బు, బియ్యం ఇవ్వగానే వారి కన్నీరు ఆగదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. టీచర్లు గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పించినప్పుడే వారికి నిజమైన సంతృప్తి కలుగుతుందని, ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించాలని హితవు పలికారు.

More Telugu News