Rahul Gandhi: వ్యాక్సిన్ల కొరత చాలా తీవ్రమైన విషయం.. ఉత్సవం కాదు: రాహుల్​ గాంధీ

  • ప్రధాని ‘టీకా ఉత్సవం’ వ్యాఖ్యలపై మండిపాటు
  • మనకే లేనప్పుడు ఎగుమతి ఎందుకని ప్రశ్న
  • దేశ ప్రజలను ప్రమాదంలో పడేయడం భావ్యమా? అని నిలదీత
  • అందరికీ వ్యాక్సిన్ వేయాలని డిమాండ్
Vaccine Shortage A Serious Issue Not Utsav Rahul Gandhi Slams PM

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఏర్పడడం చాలా తీవ్రమైన విషయమని, అది ఉత్సవం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ నెల 11 నుంచి 14 వరకు ‘టీకా ఉత్సవం’ నిర్వహిస్తామని గురువారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. టీకాలు మనకే సరిపోనప్పుడు విదేశాలకు ఎగుమతి చేయడమేంటని ప్రశ్నించారు.  

దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉన్నప్పుడు విదేశాలకు టీకాలను ఎగుమతి చేసి దేశ ప్రజలను ప్రమాదంలో పడేయం ఎంత వరకు భావ్యమని ఆయన హిందీలో ట్వీట్ చేశారు. ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని రాష్ట్రాలకూ కేంద్రం సమాన సాయం చేయాలని డిమాండ్ చేశారు. అందరం కలసికట్టుగా మహమ్మారిని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు వారు..వీరు అన్న వ్యత్యాసం లేకుండా ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలని కోరుతూ ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ రాశారు. వెంటనే టీకాల ఎగుమతిని నిలిపేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఇతర వ్యాక్సిన్లనూ త్వరగా తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. వ్యాక్సిన్లపై సైంటిస్టులు, వ్యాక్సిన్ తయారీదారులను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. వారిని తక్కువ చేసి చూస్తోందన్నారు.

More Telugu News