COVID19: మహా అయితే ఇక ఐదు రోజులు.. దేశంలో నిండుకుంటున్న కరోనా వ్యాక్సిన్లు!

  • దేశంలో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ 
  • మిగిలి ఉన్న వ్యాక్సిన్ డోసులు కేవలం 1.96 కోట్లు
  • మరో 2.45 కోట్ల డోసుల సరఫరాకు ఏర్పాట్లు 
  • ఏపీలో 1.2 రోజులకే అయిపోనున్న వ్యాక్సిన్లు
  • తెలంగాణలో 14 రోజులకు సరిపడా నిల్వ
India has vaccine stocks for 5 days

దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా జరుగుతోంది. అయితే, అంతే వేగంతో వ్యాక్సిన్లూ అయిపోవస్తున్నాయి. ఇప్పటికే ముంబై, ఘాజియాబాద్, నోయిడా, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లోని వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకాలు అయిపోయి.. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

గురువారం మధ్యాహ్నం వరకు వివిధ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సరఫరా చేసిన వ్యాక్సిన్ల లెక్కల ప్రకారం.. ఇప్పుడున్న వ్యాక్సిన్లు మహా అయితే ఐదున్నర రోజులకే వస్తాయని తెలుస్తోంది. దీంతో ఆ ఐదున్నర రోజులకు తోడు మరో వారం రోజులకు సరిపడా స్టాక్ లను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు చెబుతున్నారు.

 ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కేవలం ఒకటిన్నర రోజులకు మించి వ్యాక్సిన్లు లేవని తెలుస్తోంది. ఇటు, ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు నాలుగు రోజులకు సరిపోతాయని చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న వ్యాక్సిన్లతో మరో 14 రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేయొచ్చని అంటున్నారు. దీంతో వ్యాక్సిన్లు అత్యవసరమున్న ఏపీకి అదనంగా మరో 14,58,170 డోసులు ఇవ్వనున్నారు.

తెలంగాణకు 55,633 డోసులు పంపించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఈ అదనపు వ్యాక్సిన్లతో ఏపీలో మరో 14 రోజులు, తెలంగాణలో 20 రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించొచ్చని చెబుతున్నారు. ఏపీకి 37.95 లక్షల డోసులను సరఫరా చేయగా.. 36.57 లక్షల డోసులను జనానికి ఇచ్చారు. మరో 1,37,630 డోసులు మిగిలి ఉన్నాయి. తెలంగాణకు 26 లక్షల డోసులు ఇవ్వగా.. జనానికి 18.32 లక్షల డోసులు వేశారు. మరో 7.68 లక్షల డోసులు మిగిలాయి.


కాగా, ఏప్రిల్ నెలలో సగటున రోజూ 36 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసినట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు దేశంలో మరో కోటీ 96 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని, అవి ఐదున్నర రోజులకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. మరో 2.45 కోట్ల డోసులను అవసరాన్ని బట్టి అన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నట్టు చెబుతున్నారు.

అయితే, 11 నుంచి ‘వ్యాక్సిన్ ఉత్సవం’ నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో.. వ్యాక్సినేషన్ వేగంగా జరిగితే ఆ డోసులూ ఎంతో కాలం రావని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ సమస్య రాకుండా ప్రస్తుత వేగానికి తగ్గట్టే వ్యాక్సిన్లను స్టాక్ చేసి పెడుతున్నట్టు వివరిస్తున్నారు. వ్యాక్సిన్లను 4 నుంచి 8 రోజుల వ్యవధిలో సరఫరా చేస్తున్నామంటున్నారు. వ్యాక్సిన్ల సరఫరాపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో రోజూ చర్చిస్తున్నామని చెబుతున్నారు.

కాగా, వ్యాక్సిన్లు అయిపోవస్తున్నాయని రెండ్రోజుల క్రితం కేంద్రానికి లేఖ రాసిన మహారాష్ట్రలో ప్రస్తుతం 15,00,840 డోసుల వ్యాక్సిన్లున్నాయి. ఇప్పటిదాకా ఆ రాష్ట్రానికి కోటీ 6 లక్షల 19 వేల 190 డోసులను కేంద్రం ఇవ్వగా.. 91.18 లక్షల డోసులను జనానికి ఇచ్చింది. తాజాగా మరో 20 లక్షల డోసులను పంపించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ లెక్కన పాత స్టాక్ తో 3.8 రోజులు, కొత్త స్టాక్ కలిపితే 8.8 రోజుల పాటు వ్యాక్సిన్లను వేయొచ్చు.

కాగా, ఇప్పటిదాకా కేవలం మూడు రాష్ట్రాలకే కోటికిపైగా డోసులను పంపిణీ చేశారు. అత్యధికంగా మహారాష్ట్రకు కోటీ 6 లక్షల 19 వేల 190 డోసులు పంపించారు. ఆ తర్వాత గుజరాత్ కు కోటీ 5 లక్షల 19 వేల 330, రాజస్థాన్ కు కోటీ 4 లక్షల 95 వేల 860 డోసులను సరఫరా చేశారు.

More Telugu News