Corona Virus: తెలంగాణలో తగ్గిపోతున్న టీకా నిల్వలు.. మిగిలినవి 8 లక్షల డోసులే

  • రాష్ట్రానికి వచ్చిన 24 లక్షల టీకా డోసుల్లో 16.80 లక్షల డోసుల పంపిణీ
  • మరో వారం రోజుల్లో మిగిలిన నిల్వలూ అయిపోయే ప్రమాదం
  • కేంద్రం నుంచి స్పందన రావడం లేదంటున్న అధికారులు
Covid Vaccine Doses Stocks in Telangana Decreasing

తెలంగాణలో కరోనా టీకాల నిల్వలు మరో వారానికి సరిపడా మాత్రమే ఉన్నాయని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 24 లక్షలకు పైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేయగా, వాటిలో 16.80 లక్షల డోసుల పంపిణీ ఇప్పటికే పూర్తయింది. ఇక మిగిలింది 8 లక్షల డోసులే. రాష్ట్రంలో రోజుకు గరిష్ఠంగా 75 వేల మందికి టీకాలు వేస్తున్నారు. ఇందులో తొలి, మలి విడత టీకాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న టీకాలను కూడా ఇదే లెక్కన పంపిణీ చేస్తే మరో వారం రోజులకు మాత్రమే సరిపోతాయని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. ఇకపై రోజుకు లక్షన్నర మందికి టీకాలు వేయాలని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరో మూడునాలుగు రోజుల్లో కేంద్రం నుంచి టీకాలు రాకపోతే పంపిణీ ప్రక్రియకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. టీకాలు పంపించాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పందన లేదని రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా రెండో డోసు తీసుకోవాల్సిన వారు ఇబ్బంది పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

More Telugu News