Maharashtra: అవి చాలా తీవ్రమైన ఆరోపణలు.. విచారణ జరగాల్సిందే: మహారాష్ట్ర మాజీ హోంమంత్రిపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీం ఓకే

  • అనిల్‌ దేశ్‌ముఖ్‌పై పరంబీర్‌ సింగ్‌ అవినీతి ఆరోపణలు
  • సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశాలు
  • సవాల్‌ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన అనిల్‌ దేశ్‌ముఖ్‌
  • హైకోర్టు ఆదేశాల్ని సమర్థించిన సుప్రీం
  • అనిల్‌కు మద్దతుగా నిలిచిన మహారాష్ట్ర ప్రభుత్వానికీ చుక్కెదురు  
Supreme court Okays CBI Enquiry against Anil Deshmukh

తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలన్న బాంబే హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి  అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిందేనని స్పష్టం చేసింది. ఆరోపణలు చేసిన వ్యక్తి, ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇద్దరూ ఉన్నత పదవుల్లో ఉన్నవారని ఈ సందర్భంగా కోర్టు గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీం తిరస్కరించింది.

‘‘ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఇందులో ఉన్నవారు ఒకరు కమిషనర్‌ అయితే, మరొకరు హోంమంత్రి. ఈ నేపథ్యంలో ఇది సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన కేసు కాదా? అనిల్‌ దేశ్‌ముఖ్‌ ముందు రాజీనామా చేయలేదు. హైకోర్టు ఆదేశించిన తర్వాతే రాజీనామా సమర్పించారు.  అంటే ఆయన పదవికి అతుక్కుపోయారని అర్థం. స్వతంత్ర సంస్థను దీనిపై దర్యాప్తు జరపనివ్వండి’’ అని విచారణ సందర్బంగా జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ముంబయిలోని బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో నిందితుడిగా ఉన్న సచిన్‌ వాజేను ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఓ న్యాయవాది బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా వీరికి సుప్రీంలో చుక్కెదురైంది.

More Telugu News