Maharashtra: పెళ్లిళ్లు, రైతుల ఆందోళనలు, స్థానిక సంస్థల ఎన్నికలే కరోనా విజృంభణకు కారణం: పంజాబ్‌ పరిస్థితిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

  • పంజాబ్‌లో 80% కొత్త కేసులు యూకే వేరియంట్‌వే
  • 11 రాష్ట్రాల మంత్రులతో హర్షవర్ధన్ సమావేశం
  • ఛత్తీస్‌గఢ్‌లో కరోనా పరిస్థితిపై మంత్రి ఆందోళన
  • ఢిల్లీలో 100 కేసులు కాస్తా.. 5000కు చేరినట్లు వెల్లడి
  • మూడు రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
80 pc cases in Punjab are Due to UK Variant

పంజాబ్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 80 శాతం యూకే వేరియంట్‌కు చెందినవేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. వివాహాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రైతుల ఆందోళనలే కేసుల పెరుగుదలకు కారణమై ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్‌-19 తాజా పరిస్థితులపై నేడు 11 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో ఆయన వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు.

దేశంలో కరోనాతో అతలాకుతలమవుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ కూడా ఒకటని హర్షవర్ధన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అక్కడ కొత్త కేసుల సంఖ్య పదిరెట్లు పెరిగిందని తెలిపారు. రాయ్‌పూర్‌, దుర్గ్‌ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో సైతం కరోనా భారీ స్థాయిలో విజృంభిస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా హర్షవర్ధన్ గుర్తుచేశారు. ఓ దశలో 100కు పడిపోయిన రోజువారీ కేసులు ఇప్పుడు 5000కు పెరిగాయని తెలిపారు. అలాగే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి 50 బృందాలను పంపినట్లు తెలిపారు.

More Telugu News