Narendra Modi: పెరుగుతున్న కరోనా... ప్రత్యేక కొవిడ్ వ్యతిరేక డ్రైవ్ చేపట్టాలని కేంద్రం నిర్ణయం!

  • ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించిన మోదీ
  • రేపటి నుంచి 14 వరకూ ప్రత్యేక డ్రైవ్
  • ప్రజల్లో భయం పోవడంతోనే కేసులు పెరుగుతున్నాయన్న ప్రధాని
Covid Special Drive From Tomorrow

ఇండియాలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ, ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యేక కొవిడ్ వ్యతిరేక డ్రైవ్ ను చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా పని ప్రాంతాలు, ఆరోగ్య కేంద్రాలు, అత్యధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో రేపటి నుంచి 14వ తేదీ వరకూ ఈ డ్రైవ్ ను నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రజల్లో కరోనాపై ఏ మాత్రమూ భయం లేదని, ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను మరచిపోయారని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ కారణంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన అన్నారు.

మాస్క్ లను ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరాన్ని పాటించాలని ఎంతగా చెప్పినా ప్రజలు పాటించడం లేదని అభిప్రాయపడ్డ నరేంద్ర మోదీ, కేంద్ర బృందాలను, ప్రజా రోగ్య నిపుణులను కరోనా అధికంగా ఉన్న మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ గఢ్ సహా పలు రాష్ట్రాలకు పంపించి, అక్కడి పరిస్థితిని క్షేత్ర స్థాయిలో అంచనా వేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం మీడియాకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇక వ్యాక్సిన్ సరఫరా విషయానికి వస్తే, ఇప్పటికే టీకా తయారీ కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేశాయని పేర్కొన్న కేంద్రం, మరో రెండు మూడు వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. వ్యాక్సినేషన్ విషయంలో అవాంతరాలు ఏర్పడకుండా చూడాలన్నదే కేంద్రం అభిమతమని, సరిపడినన్ని వయల్స్ ను అందిస్తామని, అర్హులైన అందరికీ టీకాను ఇస్తామని పేర్కొంది.

ఇదే సమావేశంలో కరోనా సంబంధిత అన్ని విషయాలనూ మోదీ చర్చించారు. ఇండియాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ తో పాటు, పెరుగుతున్న కేసులు, ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు, ఆరోగ్య మౌలిక వసతులు, సరఫరా ఏర్పాట్లు, వ్యాక్సిన్ ఉత్పత్తిపైనా అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో పాటు కంపెనీలతోనూ మాట్లాడారు.

More Telugu News