Moeen Ali: నా మత విశ్వాసాలకు వ్యతిరేకం.. జెర్సీపై ఆ లోగోను తీసేయండి.. చెన్నై సూపర్ కింగ్స్ కు తేల్చి చెప్పిన మొయీన్ అలీ

  • మద్యం బ్రాండ్ లోగోను తీసేయాలని విజ్ఞప్తి
  • తన మతంలో మద్యం తాగడం, ప్రోత్సహించడం నిషిద్ధమన్న ఆల్ రౌండర్
  • తొలగించేందుకు అంగీకరించిన యాజమాన్యం
Moeen Ali tells CSK he wont wear logo of alcohol brand on jersey

తన జెర్సీపై మద్యం బ్రాండ్ లోగోను తీసేయాల్సిందిగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) యాజమాన్యాన్ని ఆ టీమ్ ఆల్ రౌండర్ మొయీన్ అలీ కోరాడు. తన మత విశ్వాసాల ప్రకారం మద్యం తాగడం, దానిని ప్రమోట్ చేయడం నిషిద్ధమని పేర్కొన్నాడు.

ఏ జెర్సీ మీద ఉన్నా తాను వాటిని ప్రోత్సహించనని చెప్పాడు. అది ఇంగ్లండ్ జెర్సీ అయినా.. లేదంటే ఏ దేశవాళీ టీమ్ కైనా తాను మద్యం బ్రాండ్ల లోగోలను ప్రోత్సహించలేనని తేల్చి చెప్పాడు. అతడి విజ్ఞప్తికి సీఎస్ కే అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. లోగోను అతడి జెర్సీ నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.

కాగా, సీఎస్ కే జెర్సీపై చెన్నైకి చెందిన ఎస్ఎన్ జే డిస్టిలరీస్ అనే సంస్థ తయారు చేస్తున్న ఎస్ఎన్ జే 10000 లోగో ఉంది. దానిపైనే మొయీన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కాగా, 2021 ఐపీఎల్ వేలంలో సీఎస్ కే జట్టు అతడిని రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది. అంతకుముందు 2018 నుంచి వరుసగా మూడేళ్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మొయీన్ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో ఇప్పటిదాకా 19 మ్యాచ్ లు ఆడిన అతడు.. 309 పరుగులు చేసి, 10 వికెట్లు పడగొట్టాడు.

More Telugu News