Corona Virus: ఆల్ టైమ్ రికార్డుకు చేరువలో కరోనా కేసులు... నిన్న 93 వేల కేసులు!

  • నిన్న 93,077 కొత్త కేసులు
  • 500 దాటిన మరణాల సంఖ్య
  • సెప్టెంబర్ 19 తరువాత అత్యధిక కేసులు
New Corona Cases Near All Time High in India

గత సంవత్సరం చివరి త్రైమాసికంలో ఒక రోజులో 98 వేల కొత్త కరోనా కేసులు వచ్చిన తరువాత, తిరిగి ఐదు మాసాల తరువాత ఆ స్థాయిలో కొత్త కేసులు వచ్చాయి. నిన్న శనివారం నాడు ఏకంగా 93,077 కేసులు వచ్చాయి. ఇదే సమయంలో నాలుగు నెలల తరువాత మరణాల సంఖ్య 500ను తాకింది. మరో వారం, పది రోజుల వ్యవధిలోనే కొత్త కేసుల సంఖ్య ఆల్ టైమ్ రికార్డును దాటేస్తుందని, అన్ని రాష్ట్రాలూ జాగ్రాత్తగా ఉండి, కరోనాను నియంత్రించే చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

కాగా శుక్రవారం నాడు ఇండియాలో 89 వేల రోజువారీ కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల్లో శుక్రవారం మిగతా అన్ని దేశాల కన్నా, ఇండియాలో కేసుల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. యూఎస్ లో 70,024, బ్రెజిల్ లో 69,692 కేసులు రాగా, వాటికి మించిన కేసులు ఇండియాలో నమోదయ్యాయి.

ఇక వారం రోజుల సరాసరిని తీసుకున్నా మిగతా దేశాల కన్నా ఇండియా ముందుంది. ఈ నేపథ్యంలో కరోనా కేసుల విషయంలో ఇండియా తొలి స్థానానికి చేరుకుంటుందని, ఈలోగానే నియంత్రణా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండియాలో అక్టోబర్ లో వారం సరాసరిని మించిన కేసులు ఇప్పుడు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

గత సంవత్సరం సెప్టెంబర్ 19 తరువాత నిన్న అత్యధిక కేసులు వచ్చాయి. అంతకుముందు సెప్టెంబర్ 17న 98,795 కొత్త కేసులు రాగా, ఇప్పటివరకూ అదే రోజువారీ రికార్డు. మరణాల విషయానికి వస్తే, డిసెంబర్ 4న 514 మంది కరోనాతో మరణించగా, నిన్న 500 మంది కన్నుమూశారు. కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో శనివారం నాడు 49,447 కేసులు రావడం గమనార్హం. మహారాష్ట్రతో పాటు హర్యానా, బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.

More Telugu News