Water Melon: ఎలుక కొరికిన పుచ్చకాయ తిని.. ఇద్దరు చిన్నారుల మృతి

  • వారి తల్లిదండ్రులు, నానమ్మ పరిస్థితి విషమం
  • అల్మరాలో ఎలుకల కోసం మందు పెట్టిన కుటుంబం
  • ఆ మందును తిని పుచ్చకాయను కొరికిన ఎలుకలు
  • పెద్దపల్లి జిల్లాలో విషాదం
Two Kids died after consuming water melon that is bit by Rats

వేసవి కాలంలో ఒంటికి చలువ చేస్తుందని పుచ్చకాయను తెచ్చుకుంది ఆ కుటుంబం. కానీ, చలువ చేస్తుందనుకున్న ఆ పుచ్చకాయే కుటుంబంలోని ఇద్దరు చిన్నారుల ఉసురు తీసింది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఇస్సంపేటలో జరిగింది. ఆ ఘటన వివరాలివి..

ఇస్సంపేటకు చెందిన శ్రీశైలం, గుణవతి దంపతులకు శివానందు (12), చరణ్ (10) అనే ఇద్దరు కుమారులున్నారు. సోమవారం కుటుంబ సభ్యులు పుచ్చకాయ తీసుకొచ్చి సగం తిన్నారు. మిగతా సగం పుచ్చకాయను అల్మరాలో పెట్టారు. మంగళవారం రాత్రి ఎల్లమ్మ కొలుపు జరుపుకున్నాక ఆ మిగతా సగాన్ని తిన్నారు. అయితే, అప్పటికే ఆ అల్మరాలో ఎలుకల మందు వేశారా దంపతులు. ఆ మందును తిన్న ఎలుకలు పుచ్చకాయను కొరికి తిన్నాయి.

అది తెలియని కుటుంబ సభ్యులు పుచ్చకాయను తినడంతో, అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం గ్రామంలో చికిత్స తీసుకున్నా నయం కాకపోవడంతో కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున శివానందు, చరణ్ లు కన్నుమూశారు. చిన్నారుల తల్లిదండ్రులు శ్రీశైలం, గుణవతి, వారి నానమ్మ సారమ్మలు మృత్యువుతో పోరాడుతున్నారు. వారికి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పిల్లలు చనిపోయిన విషయాన్ని వారి తల్లిదండ్రులకు ఇంకా చెప్పలేదని పోలీసులు తెలిపారు.

More Telugu News