DMK: డీఎంకే, కాంగ్రెస్‌ నేతలు మహిళల్ని అవమానిస్తూనే ఉంటారు.. తమిళనాడులో ప్రధాని మోదీ

  • ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాలపై మోదీ ఘాటు విమర్శలు
  • డీఎంకే, కాంగ్రెస్,‌ శాంతి భద్రతలపై భరోసా ఇవ్వలేకపోతున్నాయన్న ప్రధాని
  • తమకు ఎం.జి.రామచంద్రన్‌ పాలన స్ఫూర్తి అని వ్యాఖ్య
DMK Congress keep insulting women criticizes modi

తమిళ‌నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన డీఎంకేతో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలకు మహిళలప‌ట్ల గౌర‌వభావం లేద‌ని విమ‌ర్శించారు. శుక్ర‌వారం మధురైలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన‌ ప్రధాని.. మీనాక్షీ అమ్మవారు కొలువుదీరిన మధురై నారీశక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ విషయం అర్థంకాని కాంగ్రెస్‌, డీఎంకేలు మహిళల్ని పదే పదే కించపరుస్తాయని ఆరోపించారు. రెండు పార్టీలు అసలు శాంతి, భద్రతల విషయంలో భరోసా ఇవ్వలేకపోతున్నాయన్నారు. సమగ్రాభివృద్ధి, సంక్షేమ రాజ్యం కోసం మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్‌ చేసిన కృషి తమలో ఇప్పటికీ స్ఫూర్తి నింపుతోందన్నారు.

ఎన్‌డీయే ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ముఖ్యంగా ఉజ్వల వంటి పథకంతో మహిళ ఉన్నతికి కృషి చేసిందన్నారు. మధురై ప్రజలు తెలివైన‌వార‌ని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని, రాజకీయ పార్టీల గుణగణాలను గుర్తించి అభివృద్ధికి భరోసా ఇస్తున్న ఎన్డీయే కూట‌మికే ఓటు వేస్తారని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. టెక్స్‌టైల్ రంగంలో మరింత యాంత్రీకరణ, రుణ సౌలభ్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

More Telugu News