Salary: ప్రస్తుతానికి వేతనాల్లో మార్పు లేనట్లే!

  • లేబర్‌ కోడ్స్‌ అమలును వాయిదా వేసిన కేంద్రం
  • ఇంకా కొన్ని రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేయకపోవడమే కారణం
  • ఈ కోడ్స్ అమల్లోకి వస్తే వేతనాల్లో మార్పులు
  • టేక్‌ హోం, పీఎఫ్‌ పెరిగే అవకాశం
As of now no change in salaries

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ వల్ల వేతనాల్లో మార్పులుంటాయని ఉద్యోగులంతా భావించారు. అయితే తాజాగా వాటి అమలు వాయిదా పడింది. దీంతో ప్రస్తుతానికి వేతనాల్లో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. కొన్ని రాష్ట్రాలు ఇంకా లేబర్‌ కోడ్స్‌కు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయకపోవడం వల్లే అమలును వాయిదా వేశారు.

కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్‌ భద్రత, ఆరోగ్యం, పని నిబంధనలకు సంబంధించిన కోడ్‌లను కేంద్రం ఇప్పటికే నోటిఫై చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి నాలుగు కోడ్‌లను అమల్లోకి తీసుకురావాలని కార్మిక శాఖ నిర్ణయించింది. కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. దీంతో అటు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ముసాయిదాను రూపొందించాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి లేబర్‌ కోడ్‌ అమలును వాయిదా వేస్తున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.

లేబర్‌ కోడ్‌ల అమలు వల్ల వేతన విధానంలో మార్పులు జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి పలు కంపెనీలు బేసిక్‌ను తక్కువగా చూపి అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తం ఇస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం అలవెన్సుల వాటా 50 శాతం మించకూడదు. ఆ లెక్కన బేసిక్‌ పెరగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బేసిక్‌+ డీఏ ఆధారంగా లెక్కించే పీఎఫ్‌ వాటా సైతం పెరుగుతుంది.

రేపటి నుంచి కొత్త లేబర్‌ కోడ్స్‌ అమల్లోకి వచ్చి ఉంటే.. ఆ మేర ఇంటికి తీసుకెళ్లే వేతనం, పీఎఫ్‌ మొత్తంలో మార్పులు జరిగేవి. లేబర్‌ కోడ్‌ల అమలు వాయిదా పడిన నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు పాత విధానంలోనే జీతం అందుకోవాల్సి ఉంటుంది.

More Telugu News