Jagananna Vidyakanuka: 'జగనన్న విద్యాకానుక'పై సీఎం జగన్ సమీక్ష

  • డిక్షనరీ, పుస్తకాలు, బ్యాగులను పరిశీలించిన సీఎం
  • బడులు ప్రారంభం నాటికి విద్యాకానుక అందించాలని ఆదేశం
  • ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్
  • 2024-25లో విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాస్తారని వెల్లడి
CM Jagan reviews on Jagananna Vidyakanuka

రాష్ట్రంలో జగనన్న విద్యాకానుక పథకం అమలుపై సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు అందించే పుస్తకాలు, డిక్షనరీ, బ్యాగులను ఆయన పరిశీలించారు. వచ్చే విద్యాసంవత్సరంలో బడులు ప్రారంభం అయ్యేనాటికి విద్యాకానుక పిల్లలకు అందాలని అధికారులను ఆదేశించారు.

2021-22 సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ పైనా అధికారులతో చర్చించారు. 2024-25లో విద్యార్థులు సీబీఎస్ఈ టెన్త్ బోర్డు పరీక్షలు రాస్తారని సీఎం పేర్కొన్నారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్టు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం అమలుపైనా సమీక్షించారు. విద్యా సంస్థల్లో అభివృద్ధి కమిటీలు, అధికారులకు శిక్షణ కరదీపిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు-నేడు పనులను స్వయంసహాయక సంఘాలతో పరిశీలన చేయించాలని సూచించారు. పాఠశాలలను సరిగా నిర్వహించడంపై దృష్టి సారించాలని అన్నారు. నాడు-నేడులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ఏప్రిల్ 30న అంకితం చేస్తామని చెప్పారు.

జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. స్కూళ్లలో విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల తయారీలో ఎస్ఓపీని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

More Telugu News