India: జాతీయ పతాక ముసాయిదాకు నూరేళ్లు.. శతాబ్ది ఉత్సవాలు మాత్రం లేవు!

  • 1921 మార్చి 31న రూపొందించిన పింగళి వెంకయ్య
  • బెజవాడలో ఏఐసీసీ సమావేశాలకు వచ్చిన గాంధీజీ
  • అదే రోజు ఆ జెండాను గాంధీకి అందజేసిన పింగళి 
  • కాషాయం, తెలుపు రంగులను సూచించిన మహాత్ముడు 
  • చరకాకు బదులు అశోక చక్రం ఏర్పాటు
100 years of draft design of Indian National Flag

త్రివర్ణ పతాకం అనగానే ప్రతీ భారతీయుడి గుండెల్లో గౌరవం ఉప్పొంగుతుంది. నరనరాన రక్తం ఉరకలెత్తుతుంది. అలాంటి మన జాతీయ జెండాకు మూసాయిదా జెండాను రూపొందించి నేటికి సరిగ్గా వందేళ్లు. 1921 మార్చి 31న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఆ ముసాయిదాను రూపొందించారు. అప్పుడే కాంగ్రెస్ జాతీయ సమావేశాల కోసం తెలుగు గడ్డపైన గాంధీజీ కాలుపెట్టారు. ముసాయిదా జెండాలో పలు మార్పులు సూచించారు. ఆనాటి విశేషాలేంటో ఓ సారి తెలుసుకుందాం..

మలుపు తిరిగిందిక్కడే..

స్వాతంత్ర్య సంగ్రామం ఉద్ధృతంగా సాగుతున్న రోజులవి. ఆ క్రమంలోనే 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీన ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రెండు రోజుల సమావేశాలను విజయవాడ (అప్పటి బెజవాడ)లో నిర్వహించింది. వివిధ దేశాలకు చెందిన ఎందరో నేతలు ఆ సమావేశానికి హాజరయ్యారు. దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఈ ఘటనే కీలక మలుపు అని చెబుతుంటారు.

ఈ సమావేశాల వల్లే స్వాతంత్ర్య సంగ్రామానికి నిధుల సమీకరణ పెరిగింది. ఈ సమావేశాల్లోనే పింగళి వెంకయ్య కాంగ్రెస్ జెండాకు ముసాయిదా రూపాన్ని ఇచ్చారు. ఆ జెండాకే కొన్ని మార్పులు చేసి తదనంతర కాలంలో స్వాతంత్ర్యానికి కొన్ని రోజుల ముందు జాతీయ జెండాగా ఆమోదించారు. బెజవాడకూ మంచి గుర్తింపు దక్కింది. విజయవాడ సహా దేశంలోని ఐదు ప్రాంతాల్లో గాంధీ స్థూపాలను ఏర్పాటు చేశారు.

జెండాలో మార్పులివీ..

వాస్తవానికి మన జాతీయ జెండా మూడు రంగల సమ్మేళనమైనా.. మొదట్లో పింగళి వెంకయ్య దానిని రెండు రంగులతోనే రూపొందించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, చరకా లేదా ‘గాంధీ చక్రం’ను పెట్టి జెండాకు ముసాయిదా రూపం ఇచ్చారు. అయితే, ఆ పతాకంలో గాంధీజీ పలు మార్పులను సూచించారు. ఎరుపు స్థానంలో కాషాయాన్ని పెట్టడం, తెలుపు రంగును జోడించడం, గాంధీ చక్రానికి బదులు అశోక చక్రాన్ని పొందుపరచడం వంటి మార్పులను చెప్పారు. ఆ జెండాను కాంగ్రెస్ జెండాగా వినియోగించారు. ఇక, తదనంతర కాలంలో స్వాతంత్ర్యానికి కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ జెండానే జాతీయ పతాకంగా ప్రకటించారు.

ఏఐసీసీ సమావేశాలతో పాటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు సమాంతరంగా జరిగాయి. మార్చి 31నే పతాక ముసాయిదా నమూనాను గాంధీజికి పింగళి వెంకయ్య అందించారు. అయితే, ఆ సమావేశాలతో సమయం లేకుండా గడిపిన గాంధీజీ.. పింగళి వెంకయ్యను మర్నాడు రమ్మన్నారు. ఆ బిజీలోనే పతాకాన్ని గాంధీజీ ఖరారు చేయలేకపోయారు. దీంతో ఆ ముసాయిదా జెండాను తనతో తీసుకెళ్లారు. ఈ విషయాన్ని గాంధీజీనే స్వయంగా 1921 ఏప్రిల్ 13న యంగ్ ఇండియాకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

శతాబ్ది ఉత్సవాలేవీ?

జాతీయ పతాక ముసాయిదాను రూపొందించిన రోజైనా దానికి పెద్దగా గుర్తింపు లేకుండా పోయింది. ఇవ్వాళ్టికి వందేళ్లవుతున్నా.. శతాబ్ది ఉత్సవాల ఊసే లేదు. ఆశించినంత ప్రాధాన్యమైతే శతాబ్ది ఉత్సవాలకు దక్కలేదు. కనీస కార్యక్రమాలనూ ఏర్పాటు చేయలేదు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఏఐసీసీ సమావేశాలకు సంబంధించిన ఫొటో కేటలాగ్ ను మాత్రం విడుదల చేశారు. మంగళవారం ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ ఆనాటి సంఘటనల సమాహారమైన ఆ ఫొటోలతో కేటలాగ్ ను విడుదల చేసింది. అది తప్ప మిగతా కార్యక్రమాల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లూ చేయకపోవడం గమనార్హం.

More Telugu News