CPI Narayana: తిరుపతిలో సీపీఐ కరపత్రాలు పంచితే, వైసీపీ కరెన్సీ నోట్లు పంచుతోంది: నారాయణ

  • త్వరలో తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక
  • మద్దతుపై రేపట్లోగా నిర్ణయం తీసుకుంటామన్న సీపీఐ నారాయణ
  • రాజకీయ పక్షాల మధ్య ఐక్యత అవసరమని ఉద్ఘాటన
  • ఇతర అంశాలపైనా నారాయణ వ్యాఖ్యలు
CPI Narayana opines on Turupati by polls

తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికల్లో సీపీఐ కరపత్రాలు పంచితే, వైసీపీ కరెన్సీ నోట్లు పంచుతోందని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై రేపట్లోగా నిర్ణయిస్తామని చెప్పారు. రాజకీయ పక్షాల్లో సిద్ధాంతపరమైన ఐక్యత అవసరమని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీపైనా నారాయణ విమర్శలు చేశారు. స్వాతంత్ర్యానంతరం కార్మికులు కష్టించి సాధించుకున్న ఆస్తులను మోదీ అమ్మేస్తున్నారని వ్యాఖ్యానించారు. పోర్టులు, విమానాశ్రయాలు అదానీకి కట్టబెడుతూ, మిగిలినవి అంబానీకి ఇచ్చేస్తున్నారని ఆరోపించారు.

ఇక, ఐఏఎస్ అధికారులు పదవీవిరమణ చేయగానే ప్రభుత్వం వారిని ఇతర పదవుల్లో నియమిస్తుండడం పట్ల కూడా నారాయణ స్పందించారు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేసిన వారికి ఐదేళ్లు మరే బాధ్యతల్లో అవకాశం ఇవ్వకుండా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. అటు, ఎన్నికల్లో నోటా తీసుకువచ్చిన విధంగానే, ఏకగ్రీవాలను అంగీకరించకుండా చట్టం చేయాలని అన్నారు.

More Telugu News