Shashi Tharoor: మోదీపై చేసిన వ్యాఖ్యలకు 'సారీ' చెప్పిన శశిథరూర్

  • బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న మోదీ
  • బంగ్లాదేశ్ కోసం జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నానని వ్యాఖ్య
  • బంగ్లాదేశ్ కు ఎవరు విముక్తిని ప్రసాదించారో అందరికీ తెలుసంటూ థరూర్ ఎద్దేవా
Shashi Tharoor says sorry for his comments on Modi

ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ 50వ జాతీయ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటం తన జీవితంలో చాలా కీలకమైనదని... తన వయసు 20-22 ఉన్నప్పుడు తన స్నేహితులతో కలిసి బంగ్లాదేశ్ స్వాతంత్య్రపోరాటం కోసం జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నానని... అరెస్ట్ కూడా అయ్యానని చెప్పారు.

ఈ నేపథ్యంలో మోదీపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నిన్న విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ కు ఎవరు విముక్తి కల్పించారనే విషయం అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. మన ఫేక్ వార్తల రుచిని బంగ్లాదేశ్ కు కూడా మోదీ చూపిస్తున్నారని విమర్శించారు.

అయితే, నిన్న ఆయన చేసిన ట్వీట్ కు కొనసాగింపుగా ఈరోజు మరో ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ యుద్ధం గురించి మోదీ చేసిన వ్యాఖ్యలపై తన స్పందనకు క్షమాపణలు చెపుతున్నానని అన్నారు. తాను తప్పు చేసినప్పుడు క్షమాపణ చెపుతానని తెలిపారు.

నిన్నటి హెడ్ లైన్స్, ట్వీట్లను హడావుడిగా చదవడం వల్ల తాను అలా ట్వీట్ చేశానని చెప్పారు. బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించిన ఇందిరాగాంధీ గురించి మోదీ మాట్లాడలేదేమోననే ఉద్దేశంతో... బంగ్లాకు విముక్తి కల్పించింది ఎవరో అందరికీ తెలుసని ట్వీట్ చేశానని తెలిపారు. తప్పుగా స్పందించినందుకు క్షమాపణ చెపుతున్నానని అన్నారు.

More Telugu News