KCR: తెలంగాణలో లాక్ డౌన్ అంటూ వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చిన సీఎం కేసీఆర్

  • మళ్లీ కోరలు చాస్తున్న కరోనా రక్కసి
  • పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య
  • తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత
  • లాక్ డౌన్ ప్రకటిస్తారంటూ ప్రచారం
  • కేసీఆర్ ను కలిసిన సినీ పెద్దలు
  • లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేసిన సీఎం
CM KCR says no thought to implement another lock down

కరోనా వైరస్ భూతం మరోసారి పంజా విసురుతోన్న నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తారని, లేకపోతే కనీసం వారాంతంలోనైనా అన్నీ మూసేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. టాలీవుడ్ కు చెందిన కొందరు సినీ ప్రముఖులు లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంటున్నారా అని తనను అడిగారని, అయితే అలాంటి నిర్ణయం ఏదీ లేదని వారికి వివరించానని కేసీఆర్ తెలిపారు.

"కొందరు సినీ ప్రముఖులు నన్ను కలిశారు. ఇప్పటికే పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయని, పెట్టుబడులు పెట్టామని ఆ సినీ ప్రముఖులు వివరించారు. గతంలో విధించిన లాక్ డౌన్ తో బాగా నష్టపోయాం... మరోసారి లాక్ డౌన్ దిశగా చర్యలు లేవని వారికి స్పష్టం చేశాను. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగానే విద్యాసంస్థలను మూసివేశాం. విద్యాసంస్థలను మూసివేయాల్సి రావడం బాధ కలిగిస్తున్నా, తప్పలేదు" అని పేర్కొన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News