USA: యూఎస్ సర్జన్ జనరల్ గా వివేక్ మూర్తిని ఖరారు చేసిన సెనేట్!

  • 57-43 తేడాతో ఖరారు చేసిన సెనేట్
  • కరోనాను పారద్రోలేందుకు శ్రమిస్తానని వెల్లడి
  • ఒబామా టైమ్ లోనూ కీలక పదవిలో ఉన్న మూర్తి
US Senete Confirms Vivek Murthy as Surgeon General

మృదుభాషిగా పేరున్న ఫిజీషియన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్ గా నియమిస్తూ యూఎస్ సెనేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆయన అధ్యక్షుడు జో బైడెన్ సర్జన్ జనరల్ గానూ వ్యవహరించనున్నారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారి నియంత్రణపైనా ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఉన్నతాధికారులు వెల్లడించారు. వివేక్ మూర్తి నియామకంపై పలువురు సెనేటర్లు వ్యతిరేకత కనబరిచినా, చివరకు 57-43 ఓట్ల తేడాతో ఆయన నియామకం ఖరారైంది.

కాగా, గతంలో వివేక్ మూర్తి బరాక్ ఒబామా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన సమయంలోనూ కీలక పదవిలో ఉన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత మూర్తి కుటుంబంలోని కొందరు మరణించారు కూడా. తన నియామకం సందర్భంగా మూర్తి సెనేట్ లో మాట్లాడుతూ, ఈ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు అమెరికన్లకు సహకరించాలని ఉందని అన్నారు. సాధారణ ప్రజలకు ఎప్పటికప్పుడు శాస్త్ర ఆధారిత మార్గాన్ని సూచిస్తూ, ముందుకు సాగుతానని అన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో ప్రజలంతా తమవంతు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలని సూచించారు.

వివేక్ మూర్తి మూలాలు ఇండియాలో ఉన్నాయి. చిన్న వయసులోనే తల్లిదండ్రులతో కలసి ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. మియామీ ప్రాంతంలో తన తండ్రి నిర్వహించే క్లినిక్ లో వారాంతాలు సహాయం చేస్తూ ఉండేవారు. తన చిన్న వయసులో రాత్రుళ్లు ఫోన్ కాల్స్ వస్తుండేవని, తెల్లవారుజామునే లేచి, తన పేషంట్ల కోసం తండ్రి వెళుతుండేవారని చెప్పిన వివేక్ మూర్తి, వారి నుంచే తాను జీవిత పాఠాలు నేర్చుకున్నానని అన్నారు. మన ప్రజల ఆరోగ్య కష్టాలను ఒక్క క్షణం కూడా మరువరాదని, ఈ మహమ్మారిని పారద్రోలాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు.

More Telugu News