Mysore: బైకర్ మృతితో ట్రాఫిక్ పోలీసులను చితక్కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్

  • మైసూర్‌లోని బోగాది రింగ్ రోడ్డు వద్ద ఘటన
  • దేవరాజ్ మృతిలో తమ తప్పేం లేదన్న పోలీసులు
  • పోలీసులపై దాడిచేసిన 8 మంది అరెస్ట్
Local attack traffic police after biker dies

వాహనాల తనిఖీ సమయంలో ఓ బైకర్ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు ట్రాఫిక్ పోలీసులను చితకబాదారు. కర్ణాటకలోని మైసూరులో జరిగిందీ ఘటన. బోగాది రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో దేవరాజ్ తన స్నేహితుడు సురేష్‌తో కలిసి బైక్‌పై అటుగా వెళ్తున్నారు. గమనించిన పోలీసులు చెయ్యెత్తి బైక్ ఆపాలని కోరారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పింది. కిందపడిన దేవరాజ్ తలకు దెబ్బ తగలడంతో మరణించాడు. విషయం తెలిసిన స్థానికులు రింగు రోడ్డు వద్దకు చేరుకుని పోలీసులతో వాగ్విదానికి దిగారు.

వాగ్వివాదం మరింత ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు ఏఎస్సైలు స్వామినాయక్, మాదేగౌడ, కానిస్టేబుల్ మంజులపై దాడిచేశారు. పోలీసు జీపును నెట్టేసి తలకిందులు చేశారు. దేవరాజ్ మృతిపై పోలీసులు మాట్లాడుతూ.. అతడు తమ కారణంగా చనిపోలేదని, బైక్‌ను టిప్పర్ ఢీకొనడం వల్లే మృతి చెందాడని వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేష్ మాట్లాడుతూ.. వెనక నుంచి వచ్చిన టిప్పర్ తమను ఢీకొట్టిందని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని అన్నాడు. కాగా, పోలీసుల ఫిర్యాదుతో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News