Coronavirus vaccine: ఇతర ఔషధాలు తీసుకుంటున్నవారు కరోనా టీకా తీసుకోవచ్చా?.. నిపుణుల సలహా ఇదిగో!

  • దుష్ప్రభావాలేమైనా తలెత్తుతాయా అని చాలా మందిలో అనుమానం
  • థైరాయిడ్‌ ఔషధాలు వాడుతున్నవారు వ్యాక్సిన్‌  తీసుకోవచ్చు
  • అయితే, ముందు వైద్యుల సలహా తప్పనిసరి
  • క్యాన్సర్‌, బీపీ, షుగర్‌ రోగులు వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి
Can we take vaccine along with other medications

ఏడాది నుంచి కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచానికి వ్యాక్సిన్‌ రూపంలో కాస్త ఉపశమనం లభించింది. అయితే, ఈ టీకాను తొలుత వృద్ధులకు, కరోనాపై పోరులో ముందున్న యోధులకు, ఇతర దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న వారికి ఇస్తున్నారు. అయితే, వీరిలో చాలా మంది ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారే ఉంటారు. మరి కరోనా టీకాతో పాటు ఆయా జబ్బులకు కూడా ఔషధాలు తీసుకోవచ్చా? తీసుకుంటే టీకా పనిచేస్తుందా? ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తుతాయా? అనే ప్రశ్నలు అనేక మంది మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు చెప్పిన సలహాలు, సూచనలను పరిశీలిద్దాం..!

* రక్తాన్ని పలుచన చేసే ఔషధాలు, డెర్మా ఫిల్లర్ల వాడకం రోగనిరోధక వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొస్తాయి. ఇలాంటి మందుల వాడకం వల్ల టీకా తీసుకున్న తర్వాత స్వల్ప స్థాయిలో దద్దుర్లు, వాపు వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇది అందరిలో సంభవించకపోవచ్చని వైద్యులు స్పష్టం చేశారు.

* రోజువారీ మందులు తీసుకునేవారు ఒక్కరోజు తప్పినా.. ఆరోగ్యంలో మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీకా తీసుకున్న సమయంలో మరి వాటిని ఆపాలా? వద్దా? అనేది పూర్తిగా జబ్బు, దానికి వాడుతున్న ఔషధాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ విషయంలో వైద్యుల సలహా తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహ సమస్యలున్నవారు వైద్యులను సంప్రదించాల్సిందే.

* కరోనా వ్యాక్సిన్‌ తీసుకోగానే రోగనిరోధక వ్యవస్థలో వేగంగా మార్పులు వస్తాయి. అయితే, మన శరీరతత్వం, తీసుకునే మందులను బట్టి ఇది నెమ్మదించవచ్చు. సాధారణంగా దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారిలో రోగనిరోధక వ్యవస్థ నెమ్మదిగా బలపడుతుంది. ఈ నేపథ్యంలో ఇతర మందులు వాడే వారిలో కరోనాను ఎదుర్కోగలిగే రోగనిరోధక శక్తి కాస్త ఆలస్యంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

* థైరాయిడ్‌ ఔషధాలు వాడుతున్నవారు వ్యాక్సిన్‌ను భేషుగ్గా తీసుకోచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే థైరాయిడ్‌ను నియంత్రించే రోగనిరోధక వ్యవస్థ, సూక్ష్మజీవులతో పోరాడే వ్యవస్థ రెండూ చాలా భిన్నమైనవి. ఈ నేపథ్యంంలో టీకా వల్ల వృద్ధి చెందే రోగనిరోధక శక్తికి ఎలాంటి అవాంతరం ఉండదని వైద్యుల అభిప్రాయం.

* అలర్జీలు, ఆస్తమాతో బాధపడుతున్నవారిలో కూడా టీకా వల్ల ఎలాంటి సమస్య తలెత్తడం లేదని గుర్తించినట్లు వైద్యనిపుణులు తెలిపారు. అయితే టీకా తయారీలో వినియోగించిన పదార్థాల వల్ల అంతకుముందే ఎవరికైనా అలర్జీలు తలెత్తిన చరిత్ర ఉంటే టీకా తీసుకోవద్దని సూచించారు.

* గుండె సంబంధిత సమస్యలు, గుండె పోటు, రెనల్ ఫెయిల్యూర్‌ (కిడ్నీ వైఫల్యం) వంటి సమస్యలు గతంలో తలెత్తి శస్త్రచికిత్స తీసుకున్నవారు సాధారణ ఔషధాలతో పాటే టీకా తీసుకోవచ్చని వైద్యులు తెలిపారు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వారం నుంచి పది రోజుల ముందు ఎవైనా తీవ్ర సమస్యలు ఏర్పడితే మాత్రం టీకా తీసుకోవడాన్ని వాయిదా వేస్తే మంచిదని వైద్యులు తెలిపారు.

* ఇక క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకోవడం ప్రారంభించని వారు టీకా తీసుకోవచ్చని వైద్యులు తెలిపారు. కానీ, కీమోథెరపీ వంటి చికిత్సలో ఉన్నవారు మాత్రం వ్యాక్సిన్‌ తీసుకోవద్దని సూచించారు. ఈ విషయంలో వైద్యుల సలహాననుసరించాలన్నారు. అలాగే క్యాన్సర్‌ నుంచి కోలుకున్నవారు కూడా టీకా తీసుకోవచ్చని తెలిపారు.

More Telugu News