USA: బైడెన్​ కు సంకటం.. అమెరికాలోకి క్యూ కడుతున్న మెక్సికో మైనర్లు!

  • ఈ నెల మూడు వారాల్లోనే 17 వేల మంది
  • రోజూ సగటున 550 మంది వలసదారులు
  • వసతి షెల్టర్లు సరిపోవట్లేదంటున్న అధికారులు
  • సామర్థ్యానికి మించి షెల్టర్లు
Thousands Of Unaccompanied Minors At Border US Caught Unprepared

గత ఇద్దరు అమెరికా అధ్యక్షులకు ఎదురుకాని పరిస్థితి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు ఎదురవుతోంది. ఊహించని రీతిలో మెక్సికో నుంచి మైనర్లు అమెరికాకు వలస బాట పట్టేస్తున్నారు. 2014, 2019లతో పోలిస్తే ఇప్పుడు వారి తాకిడి తీవ్రమైపోయింది. ఎన్నడూ లేనంతగా అక్కడి నుంచి అక్రమ వలసలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నెలలో మూడు వారాల్లోనే 17 వేల మందికిపైగా మైనర్లు సరిహద్దులు దాటి వచ్చారు. రోజూ సగటున 550 మంది అమెరికాలోకి వస్తున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

పిల్లలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడానికి ముందు మంచి వసతి, రక్షణ, భద్రత కల్పిస్తుండడంతో మైనర్ల వలస తాకిడి ఎక్కువైపోయిందని అధికారులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆ పరిస్థితి మరింత తీవ్రమైందని వాపోతున్నారు. దక్షిణ టెక్సాస్ లో ఏర్పాటు చేసిన ఓ షెల్టర్ లో... పరిమితికి మించి వలసదారులున్నారని చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ 1500 శాతం అధికంగా వలస వచ్చిన మైనర్లున్నారట.

వాస్తవానికి 2014, 2019లో ఒబామా, ట్రంప్ లు శరణార్థులుగా అర్హత లేని వారిని (కెనడా, మెక్సికో మినహా).. వచ్చిన వారిని వచ్చినట్టే తిరిగి పంపించేశారు. కానీ, బైడెన్ మాత్రం వారికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అలా వెంటనే తిరిగి పంపించేయడం మన సంస్కారం కాదని అంటున్నారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఏర్పాటు చేసిన వసతి సముదాయాల్లో ఏర్పాట్లను మరింత పెంచుతున్నారు. వచ్చిన వారు ఎంతమంది ఉన్నా మెరుగైన వసతులు ఇవ్వాలని సూచిస్తున్నారు.

అయితే, బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొమ్మిది రోజులకే.. నాటి అధ్యక్షుడు ట్రంప్ తెచ్చిన రూల్ ను అమెరికా ఫెడరల్ కోర్టు ఆమోదించింది. దాని ప్రకారం అక్రమ వలసదారులందరినీ పంపించేయాల్సి ఉంటుంది. కానీ, బైడెన్ మాత్రం దానిని వ్యతిరేకిస్తున్నారు. మానవతా దృక్పథంతో వారిని అమెరికాలోనే ఉండనిచ్చేందుకు నిర్ణయించారు.

జనవరి నాటి లెక్కల ప్రకారం హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఏర్పాటు చేసిన షెల్టర్లలో ప్రతి నలుగురు మైనర్లలో ముగ్గురు 15 ఏళ్ల వారే. కేవలం 13 శాతం మంది చిన్నారులే 12 లేదా ఆ లోపు వయసున్న వారు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. మొత్తంగా వస్తున్న వలసదారుల్లో 70 శాతానికిపైగా బాలురే ఉన్నారట.

More Telugu News