Jagan: మద్యం ధరలను పెంచి, మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు: జవహర్

  • మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి.. అమ్మకాలను పెంచారు
  • పేదల సంపాదనంతా తాగడానికే ఖర్చవుతోంది
  • ఏపీలో జగన్ బ్రాండ్లు మాత్రమే దొరుకుతున్నాయి
Only Jagan brads liquor is available in AP says Jawahar

మద్యపాన నిషేధం విధిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలను, రేట్లను పెంచి మహిళల తాళిబొట్లను తెంచుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. మద్యం ధరలను పెంచడంతో పేదల సంపాదనంతా తాగడానికే ఖర్చవుతోందని... దీంతో, వారు కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. మద్యం ధరలను పెంచి పేదల రక్తం తాగుతున్నారని సీఎంపై విమర్శలు గుప్పించారు. మద్యానికి అలవాటు పడిన వారు దాన్ని మానలేక... ఇంట్లో మహిళలను వేధిస్తున్నారని చెప్పారు.

మద్యం కొనలేక కొందరు వ్యక్తులు శానిటైజర్ తాగి చనిపోతున్నారని జవహర్ ఆవేదన వ్యక్తం చేశారు. శానిటైజర్, నాటు సారా తాగి కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ చావులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. పక్కనున్న తెలంగాణలో అన్ని బ్రాండ్లు లభిస్తున్నాయని... ఏపీలో మాత్రం జగన్ సొంత బ్రాండ్లు మాత్రమే దొరుకుతున్నాయని మండిపడ్డారు. వైసీపీ నేతలు, వాలంటీర్లు మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. మద్యం అమ్మకాలను పెంచి ఆదాయాన్ని పెంచుకోవాలనే ధ్యాసే తప్ప... మద్యపాన నిషేధం విధించాలనే ఆలోచన జగన్ కు లేదని అన్నారు. ఈ  విషయం ప్రజలకు కూడా అర్థమైందని తెలిపారు.

More Telugu News