Ganta Srinivasa Rao: అనకాపల్లిలోని గంటా కార్యాలయంలో కీలక సమావేశం... విశాఖ ఉక్కు ఉద్యమ కార్యాచరణపై చర్చ

  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • గంటా కార్యాలయంలో ఉండవల్లి తదితర నేతల భేటీ
  • త్వరలోనే కార్యాచరణ వెల్లడిస్తామన్న ఉండవల్లి
  • రాజకీయాలకు అతీతంగా ఉద్యమం ఉంటుందన్న గంటా
Meeting held at Ganta Srinivasa Rao office in Anakapalli

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనకాపల్లిలోని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో నేతలు సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంపై చర్చించారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు గాను కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలతోనూ కలిసి చర్చించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమంపై చర్చించామని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ, రాజకీయాలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఉండవల్లి తన మేధో సంపత్తితో ఉద్యమానికి సహకరిస్తారని తెలిపారు. అనేకమంది ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని, అందరినీ ఒకేతాటిపైకి తీసుకువచ్చి ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని గంటా పేర్కొన్నారు.

More Telugu News